జూన్ 7, 2026న... అతి సాధారణంగా చిన్నతనంలో గొర్రెల కాపరిగా, యవ్వనంలో వ్యవసాయదారునిగా జీవించిన వ్యక్తి కంచ కట్టయ్యకు చనిపోయిన సంవత్సరం వ్యవధిలోనే నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అది ఆయన పుట్టి, పెరిగిన ఊరిలోనే. ఎందుకు అనేది ఈ వ్యాసం చదివేవారికి ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకో కొంచెం వివరంగా పరిశీలిద్దాం. 1979 నాటికే గుండె రోగంతో చనిపోయే ఆ యువకుడు పెద్ద పట్టుదలతో 727 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీ)లో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు.
ఆయనకు గుండెలో మిట్రల్వాల్వ్లు పనిచేయడం లేదని కనుక్కున్న అక్కడి డాక్టర్లు అమెరికాలో అప్పుడప్పుడే తయారైన ఎడ్వర్డ్ వాల్వ్‌ని ఆయన గుండెలో అమర్చారు. హైదరాబాద్‌లో ఈసీజీ కూడా లేని రోజులవి. ఆనాడు అమర్చిన వాల్వ్ (కవాటం)తో ఆయన దాదాపు 47 ఏండ్లు అదనంగా బతికి 7-6-2025న తన 77వ ఏట చనిపోయాడు.
కట్టయ్య పుట్టి పెరిగి, కురుమకుల పెద్దమనిషిగా, రైతుగా, గ్రామానికి వివిధ అభివృద్ధి పనులు చేశాడు. మద్దికాయల ఓంకార్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో చేయించిన పనులు ఉన్నాయి. ఆయన శవాన్ని సొంతభూమిలోనే ఖననం చేసిన కాటికి ఎదురుగా ఉన్న గుడ్ షఫర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూలులో జరిగిన 10 దినపు యాది సభకు వివిధ రంగాల్లో పనిచేసే చాలామంది హాజరయ్యారు.
ఆయన విగ్రహమెందుకు?
.సైన్సు మనిషి కంచ కట్టయ్య యాదిలో జరిగిన ఆ సభలో ఆయన సైన్సుపై, డాక్టర్లపై, మెడిసిన్‌పై నమ్మకంతో ఎలా బతికాడో ఆయన గురించి తెలిసినవారు మాట్లాడారు. ఆ సభకు హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌కు చెందిన మట్టి మనిషి కొల్లూరి సత్తయ్య కుటుంబంతో హాజరయ్యాడు. ఆయనే తెల్లాపూర్‌లో గద్దర్ చనిపోయిన ఏడాదిలో ఒక పెద్ద విగ్రహం పెట్టించాడు. నిరక్షరాస్యుల మధ్య, సెల్‌ఫోన్‌కు, పుస్తకాలకు దూరంగా ఉండే చదువులేక బతికే మనుషులకు విగ్రహం ఎట్లా ఆదర్శవంతమవుతుందో నిరక్షరాస్యుడైన సత్తయ్యకున్న అవగాహన నాకు తెలిసి పీహెచ్డీ చేసిన మేధావులకు కూడా ఉండదు.
బీహెచ్ఈఎల్లో ఒక నిరక్షరాస్య కార్మికుడుగా ప్రారంభమైన ఆయన జీవితం అంబేద్కర్ విగ్రహం ఇన్స్పిరేషన్తో ఎట్లా మారిందో, ఎట్లా ఆ ఇన్స్పిరేషన్ బీహెచ్ఈఎల్ కార్మికవర్గానికి నాయకుడిని చేసిందో ఆయనకు ‘విగ్రహ స్ఫూర్తి’ అనుభవం ఉంది. అందుకే ఈ గ్రామంలో సైన్సు మనిషి కట్టయ్య విగ్రహాన్ని నేనే పెట్టిస్తాను అని 16–6–2025 సభలో ప్రకటించాడు. ఫలితం 7–6–26 నాటికి ఆ స్కూలు ఎదురుగా ఆయన కాడు దగ్గరలో నిలువెత్తు సైన్సు మనిషి కంచ కట్టయ్య విగ్రహం నిలబడిపోయింది.
గ్రామాలకు ఆదర్శం కావాలనే...
‘చావుతో పోరాడినవు కట్టన్నా.. నువ్వు సైన్సుతోనే గెలిసినవు మా యన్నా.. మూఢ నమ్మకాలను పాతరనే పెట్టినావు.. నికార్సయిన జిందగీని బతికి సూపెట్టినవు’. అంటూ సాగిన పసునూరి రవీందర్ రాసి పాడిన పాట సైన్సుకు, మూఢ నమ్మకాలకు మధ్య ఉన్న సంఘర్షణను అక్కడకొచ్చిన జనానికి అర్థమయ్యేలా చెప్పింది. మనుషులుగాని, జంతువులుగాని ప్రకృతిలో నిమిడీకృతమై ఉండే సైన్సుతో బతుకుతారు లేదా బతుకుతాయి. జంతువులకు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని సైంటిఫిక్‌గా ఎలా వాడుకోవాలో మాత్రమే తెలుసు. కానీ మనిషికి సైన్సుతో బతుకుతూ, మూఢ నమ్మకాల్లోకి జారుకునే మానసిక బలహీనత కూడా ఉన్నది. రాళ్లకు, రప్పలకు మొక్కడంతోపాటు మనిషి మాంత్రికుల మాయలో కూడా పడి సర్వం కోల్పోతారు.
కానీ, కట్టయ్య కేవలం సైన్సును, డాక్టర్లను, మెడిసిన్‌ను ఉపయోగించుకుని 77ఏండ్లు బతికాడు. ఆ సైన్సుపై నమ్మకానికి ఆయన విగ్రహం గ్రామాలకు ఆదర్శం కావాలనేది ఆలోచన. నలిగింటి శరత్ చమార్ రాసిన మరో పాటలో.. ‘రాళ్లకు రప్పలకు మొక్కనోడు.. డాక్టర్లను మాత్రమే నమ్మినోడు..సైన్సు లేకపోతే లోకమే ముందుకు నడువదని సాటి చెప్పినాడు’. ఆధునిక సైన్సు యుగంలో మూఢనమ్మకాలు కూడా పెరిగి కుటుంబాలు పేకమేడల్లా కూలుతున్నాయి. చదువుకు సన్యాసత్వానికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతున్న రోజులివి. ఈ సంఘర్షణకు కట్టయ్య జీవితం ఒకపరిష్కారం చూపెడుతుంది. ఈ విగ్రహాన్ని చూస్తే సైన్సుపై నమ్మకం పెరుగుతుంది.
ఫొటోకు విగ్రహానికి ఉన్న తేడా..
ఈ ప్రపంచాన్ని వేల ఏండ్లు అక్షర రూపంలేని సైన్సు శాసించింది. కానీ రాతతో కూడిన చదువు ఉనికిలోకి వచ్చాక రచనా రంగం ప్రకృతిలోని సైన్సుపై సాగే బదులు మతం, అందులోని మూఢ నమ్మకాలతో కూడన కథలు రాయడం ఎక్కువ జరిగింది. ఆధునిక
యుగంలో సైతం ఈ దేశంలో ఒక పుస్తకానికంటే విగ్రహానికి ఎక్కువ ఆదరణ ఉంది. అయితే మతపర రాతి విగ్రహాలు వంద ఏండ్లు ఈ దేశంలో ఉన్నాయి. ఆధునిక స్వతంత్ర భారతదేశంలో జాతీయ నాయకులు విగ్రహాలు వీధులలో పెట్డడం ప్రారంభమైంది. అయితే సైన్సును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలవో, ప్రఖ్యాత డాక్టర్లవో విగ్రహాలు తక్కువే. నిరక్షరాస్యుల మధ్య, వెనుకబడిన కులాల వర్గాల మధ్య అంబేద్కర్, మహాత్మా ఫూలే విగ్రహాలు నిర్వహించిన విప్లవాత్మక రోల్ మరే వ్యక్తులు నిర్వహించలేదు. విగ్రహానికి, ఫొటోకు ఒక తేడా ఉంది. విగ్రహం ఉన్న ప్రాంతం నుంచి పోయేవారిని ఆకర్షిస్తుంది.
ఇతనెవరు? ఈ వ్యక్తి దేనికి ప్రత్యేకం? అని నిరక్షరాస్యులు సైతం ఈ విగ్రహం కింద ఉన్న ఆ వ్యక్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. మనదేశపు గ్రామాల్లో ప్రజలు ప్రతినిత్యం కాలినడకన తిరుగుతారు కనుక రోజువారి పనుల్లో సైతం దానిపై కన్ను పడుతుంది. ఒకటో, రెండో ఆ విగ్రహం వ్యక్తి చేసిన మంచి పనులు మనుషులను ప్రభావం చేయకుండా ఉండవు. ఆ ప్రభావం ముఖ్యంగా పిల్లల మీద పడితే వారిలో ఒక నూతన ఆలోచన శక్తి, ఆ వ్యక్తి గురించి మరీ మరీ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.
సైన్సు జ్ఞానాన్ని విగ్రహం ప్రచారం చేస్తే..
ఒక గ్రామంలో సైన్సు ప్రాముఖ్యతను ఒక విగ్రహం ప్రచారం చేస్తే అది బతికున్న మనిషి కంటే శక్తిమంతంగా మారుతుంది. కట్టయ్య చిన్నతనంలో రావడానికి కారకురాలైన రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు ఆయన తల్లి మూఢ నమ్మకంతో ఆరోగ్యం నయమవుతుందని మాంత్రికుల చుట్టూ తిప్పింది. నల్లకోళ్లు, నిమ్మకాయలు, వాళ్లు తాగేందుకు సారా అన్నీ వారికి ఇచ్చింది. ఆ మాంత్రికులు బాగా తాగి కోసిన కోడి తలకాయలను, కోసిన నిమ్మకాయ ముక్కలను, పగలగొట్టిన కొబ్బరికాయ ముక్కలను బజార్లలో పడేస్తే వాటిని చూసి భయపడ్డ ఎంతోమంది పిల్లలు, పిచ్చి నమ్మకస్తులు రోగాల పాలయ్యారు.
కానీ ఆయనకు గుండె జబ్బు మొదలవుతుందనే విషయం మూఢ నమ్మకం ద్వారా బయటపడలేదు. చివరికి రుమాటిక్ జ్వరానికి హన్మకొండలోని మెథడిస్ట్ హాస్పిటల్ డాక్టర్లు మందులిచ్చాక ఆయన 1976లో గుండెలో వాల్వ్ లేదని తేలేవరకు ఆరోగ్యంగా బతికాడు. 11వ తరగతి వరకు చదువుకున్నాడు. 1969లో పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లల తండ్రిగా 1979లో ఆపరేషన్ వల్ల 2025 వరకు బతికాడు. ఇది సైన్సు ముఖ్యంగా మెడిసిన్ గొప్పతనం. ఆయన పుట్టి పెరిగి మాంత్రికుల మాయలో కొట్టుమిట్టాడిన పాపయ్యపేట గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లోనే ముగ్గురు, నలుగురు మాంత్రికులను వారిపై అనుమానితులు కొట్టి చంపారు.
ప్రకృతి ప్రవక్త
మెడికల్ సైన్సు వల్ల, ఆపరేషన్ల వల్ల ఎటువంటి అనర్థాలు కూడా ఉండవని ఆయన సైన్సు జీవితం ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఒక సింబల్‌గా ఉంటుంది. అందుకే నలిగింటి శరత్ ఆయన మీద రాసిన పాటలో ఆయన్ని ‘ప్రకృతి ప్రవక్త’ అని వర్ణించాడు. ఆశ్రమాల్లో కాళ్లు మడతేసుకుని కూర్చుని గురువులమనేవారు ప్రవక్తలు కాలేరు. ప్రవక్త ప్రకృతిని, మానవ జీవితానికి అనువైనదిగా మార్చాలి. మెడికల్ సైన్సు అటువంటి ప్రకృతి ప్రవక్తలే కనుగొన్నారు.
పుట్టిన ప్రతి స్త్రీ, పురుషుడు మరణిస్తాడు. కానీ, భవిష్యత్ తరాలకు ఒక మెసేజినిచ్చే జీవితాలు కొన్నే ఉంటాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట అనే మారుమూల గ్రామంలో సైన్సు మనిషి కంచ కట్టయ్య విగ్రహం అటువంటి మెసేజినిస్తుంది. మనుషుల నమ్మకం సైన్సుపైనా, మూఢత్వంపైనా అని అర్థంకాని దశలో ఉన్న పిల్లలు, యువకులు సైన్సు మాత్రమే గ్రామాలను, పట్టణాలను మారుస్తుందని నమ్మడానికి ఆ మాటలురాని విగ్రహం సహకరిస్తుంది.
మాంత్రికులు కాదు, మంత్రాలు కాదు. డాక్టర్లు, మెడిసిన్ వల్ల మాత్రమే నేను బతుకుతాను అని అర్థమయ్యాక ఆయన ఒక్కపైసా కూడా మూఢ నమ్మకాలపై ఖర్చు పెట్టలేదు. ఇటువంటి వ్యక్తులు గ్రామాల్లో అక్కడక్కడా ఉన్నారు. వారి అరుదైన జీవన విధానంమీద చాలా ప్రచారం జరిగినప్పుడే గ్రామాలు, రాష్ట్రాలు, దేశ ఆరోగ్యంతో అభివృద్ధి చెందుతుంది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
- రచయితలు 'వెలుగు'కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
