జూన్ 2 తర్వాత ఆర్టీసీ బస్సులో ఆధార్ పనిచేయదు.. మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఎట్లా..?

జూన్ 2 తర్వాత ఆర్టీసీ బస్సులో ఆధార్ పనిచేయదు.. మరి మహిళలకు ఉచిత ప్రయాణం ఎట్లా..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో మార్పులు రానున్నాయి. ఈ స్కీమ్ లో భాగంగా మహిళలకు ఆధార్ కార్డు ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం కోసం  జీరో టికెట్ జారీ చేస్తున్నారు. అయితే  రాష్ర్ట అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు పనిచేయదు.  దీనికి ప్రత్యామ్నాయంగా మహిళలందరికీ  స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేయనుంది తెలంగాణ ఆర్టీసీ.

మహాలక్ష్మి పథకాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు త్వరలో మహిళలకందరికీ మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డుల పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 న స్మార్ట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇక నుంచి స్మార్ట్ కార్డు ఉంటేను బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. లేదంటే టికెట్ తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డును పరిగణిస్తూ వస్తున్న ఆర్టీసీ.. ఇక నుంచి స్మార్టు కార్డును మాత్రమే అంగీకరించనుంది.  అయితే లబ్ధిదారులైన మహిళలందరికీ ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులు పూర్తిగా అందేంత వరకు యథావిధిగా పాత పద్ధతిలోనే ఆధార్ కార్డు చూపిస్తూ ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

 విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్న సీజన్‌ పాస్‌ల మాదిరిగా మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులు ఇవ్వనుంది ఆర్టీసీ. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 

  • స్మార్ట్ ​కార్డు ఎలా పని చేస్తుందంటే..

స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని అధికారులు తెలిపారు. కార్డులోని చిప్ లో లబ్ధిదారుల పేర్లు, అడ్రస్, వాళ్లకు కేటాయించిన ఐడీ నెంబర్​ను నిక్షిప్తం చేస్తారు. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్లకు ఆధార్​కార్డు చూపిస్తే టికెట్​ఇస్తున్నారు.

కానీ, కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చిన స్మార్ట్​కార్డును కండక్టర్​వద్ద ఉండే టికెట్​ఇష్యూయింగ్​మెషీన్(టిమ్)తో స్వైప్ చేస్తారు. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. అంటే ఇక నుంచి స్మార్ట్ కార్డు ఉంటేనే మహిళలకు ఉచిత ప్రయాణం.. లేదంటే టికెట్ తీసుకోవాల్సిందే. ఇది దశలవారీగా అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.