- ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పటిష్టమైన విద్యావ్యవస్థకు సమర్థవంతమైన పర్యవేక్షణ అత్యంత కీలకమని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ పేర్కొంది. గత 20 ఏళ్లుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పైస్థాయి పదోన్నతులు కల్పించకపోవడం వల్ల ఎంతో అనుభవజ్ఞులైన విద్యావేత్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి, మల్కా కొమురయ్య హాజరై సంఘీభావం తెలపగా, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్. రాజ గంగారెడ్డి, ఎస్. గిరిధర్ గౌడ్ మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడటం, విద్యాసంస్థల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిప్యూటీ ఈవో, డైట్ సీనియర్ లెక్చరర్ పదోన్నతులను చేపట్టాలని, అలాగే ఎంఈఓ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి. తుకారం, శ్యాంసుందర్ తో పాటు భారీ సంఖ్యలో ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ టీచర్లకు ఎంఈఓ, డిప్యూటీఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్లు వెంటనే కల్పించాలని లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వీరాచారి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ హెడ్మాస్టర్ల ధర్నాను తప్పుబట్టిన ఆయన.. పర్యవేక్షణ పోస్టుల్లో పీఆర్ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జడ్పీ స్కూళ్లను ఆయా జిల్లాల జడ్పీలకు అప్పగించాలని, గవర్నమెంట్ స్కూళ్లలోని పీఆర్ టీచర్లను వారి మాతృ సంస్థలకు పంపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
