వాటర్ బోర్డుకు మరో తలనొప్పి!...‘కోర్’ ప్రాంతాల నుంచి ఉచిత నీటి కోసం ఒత్తిడి

వాటర్ బోర్డుకు మరో తలనొప్పి!...‘కోర్’ ప్రాంతాల నుంచి ఉచిత నీటి కోసం ఒత్తిడి
  •     ఇప్పటికే 2.60 లక్షల దరఖాస్తులు
  •      ప్రభుత్వ అనుమతి కోసం అధికారుల వెయింటింగ్

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ప్రస్తుతం పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో నడుస్తున్న ‘నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా’ పథకాన్ని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని విలీన ప్రాంతాలకు కూడా విస్తరించాలనే డిమాండ్ ఇప్పుడు మెట్రో వాటర్ బోర్డుకు పెద్ద సవాలుగా మారింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 6,22,099 మంది బిలో పావర్టీ లైన్ డొమెస్టిక్ వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఒక్కో వినియోగదారునికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్న బోర్డు.. ఆ పరిమితి దాటిన వినియోగంపైనే బిల్లులను వసూలు చేస్తోంది. ఈ పథకం అమలుతో వాటర్ బోర్డుపై నెలకు సుమారు 3 కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీనిని కొనసాగిస్తోంది. 

బోర్డుపైనే భారం వేస్తారా.?

తాజాగా ఓఆర్ఆర్ పరిధిలోని కొత్త ప్రాంతాలు వాటర్ బోర్డు పరిధిలోకి రావడంతో అక్కడి బస్తీలు, కాలనీల నుంచి సుమారు 2.60 లక్షల మంది వినియోగదారులు ఉచిత నీటి కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. వాస్తవానికి ప్రస్తుతం రోజుకు 800 ఎంజీడీల నీటి డిమాండ్ ఉండగా, బోర్డు కేవలం 560 ఎంజీడీలను మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. ఈ క్లిష్ట సమయంలో కొత్తగా విలీన ప్రాంతాలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ఒక స్పష్టమైన ‘పాలసీ నిర్ణయం’ తీసుకోవాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందా లేదా బోర్డునే భరించమని ఆదేశిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా అధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే వేలాది మంది కొత్త వినియోగదారుల ఆశలు ఆధారపడి ఉన్నాయి.