ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే కల్లాలలో పాడవుతోంది. అధిక దిగుబడి వచ్చిందన్న ఆనందం మాయమైపోతోంది. పండించిన ధాన్యాన్ని కాపాడుకో లేకపోతున్న బాధ రైతులను వెంటాడుతోంది. ఈ పంటకోత తర్వాత వచ్చే కష్టాలు పునరావృతం అవుతున్న తీరు మన వైఫల్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే సమస్య కొత్తది కాదు, సమస్యకు కారణాలు కొత్తవి కావు.
ఈ ఆధునిక యుగంలో మనం పండించిన పంటను కాపాడుకోలేకపోవడం మరింత బాధాకరం. దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంటున్నా, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి ఉన్నప్పటికీ వివిధ రకాల కారణాల వల్ల పంట కోత తర్వాత పంట నష్టానికి గురవుతోంది. దానివల్ల రైతులు గణనీయంగా ఆర్థిక నష్టానికి గురవుతున్నారు. దీంతో
జాతీయ ఆహార భద్రతకు ముప్పు
వాటిల్లనుంది. పంటకోత తర్వాత పంటనష్టం ఒక 'నిశ్శబ్ద సంక్షోభం'లాగ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీ నష్టం నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యయనం ప్రకారం 2021-–22 సంవత్సరంలో పంట కోత అనంతర కలిగిన నష్టాలు ఇలా ఉన్నాయి.. తృణధాన్యాలు 2.49 మిలియన్ మెట్రిక్ టన్నులు, పప్పుధాన్యాలు 1.37 మిలియన్ మెట్రిక్ టన్నులు, నూనెగింజలు 2.11 మిలియన్ మెట్రిక్ టన్నులు, పండ్లు 7.36 మిలియన్ మెట్రిక్ టన్నులు, కూరగాయలు 11.97 మిలియన్ మెట్రిక్ టన్నులు, తోట పంటలు (చెరకుతో సహా), పశుసంపద 3.01 మిలియన్ మెట్రిక్ టన్నులు నష్టపోయాయి.
ఈ నష్టాల వల్ల కలిగిన ద్రవ్యపరమైన నష్టాలు సుమారుగా రూ. 1,52,790.42 కోట్లు. వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం ద్రవ్య నష్టం, జాతీయ జీడీపీలో (2022-–23 మొదటి త్రైమాసిక ప్రస్తుత ధరల వద్ద) 2.35 శాతానికి సమానం. దేశవ్యాప్తంగా పంటకోత తర్వాత నష్టపోయిన ఈ నష్టం సుమారుగా మన రాష్ట్ర బడ్జెట్లో సగభాగం.
53 శాతం వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ కొరతవ్యవసాయ ఉత్పతుల్లో ఈ నష్టాలు.. సమర్థవంతమైన కోత, నిర్వహణ, నిల్వ, రవాణా లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని తెలియజేస్తున్నాయి. ఇక దేశ వ్యవసాయ ఉత్పత్తులు, నిల్వ సామర్ధ్యాన్ని చూస్తే, 2024-–25లో భారతదేశం 353.96 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించింది. కేంద్రం ధాన్యాల నిల్వ కోసం భారత ఆహార సంస్థ, రాష్ట్ర సంస్థల వద్ద 91.78 మిలియన్ టన్నుల సామర్థ్యపు నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా సుమారుగా 8,815 శీతల గిడ్డంగులు ఉన్నాయి. వాటిల్లో సుమారుగా 40.22 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 2024–25లో మొత్తం నిల్వ సామర్థ్యం ప్రస్తుతం కేవలం 14.49 కోట్ల టన్నులుగా ఉంది. ఇది మొత్తం ఉత్పత్తిలో సుమారు 47 శాతం మాత్రమే.
అంటే దాదాపుగా 53 శాతం వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ కొరత ఉంది. ప్రపంచలోని ప్రధాన దేశాల ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని చూస్తే ఆ ఆయా దేశాల్లో మెరుగైన నిల్వ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఉత్పత్తిలో నిల్వ సామర్థ్యం శాతాన్ని పరిశీలిస్తే చైనా 100 శాతం, అమెరికా 120–160 శాతం, బ్రెజిల్ 130–150 శాతం, కెనడా 130 శాతం, రష్యా 110–120 శాతం నిల్వ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.
ధాన్యం నిల్వ కేంద్రాల కొరత
ఇక గ్రామస్థాయిలో రైతులకు పంటకోత తర్వాత ధాన్యం నిల్వకు సరిపడా ధాన్యం నిల్వ కేంద్రాలు లేవు. బహుళ సేవా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నప్పటికీ అవి అన్ని గ్రామాలలో లేవు. దేశవ్యాప్తంగా సుమారుగా 6.65 లక్షల గ్రామాలు ఉండగా కేవలం సుమారుగా 1,01,524 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో పదివేలకుపైగా ఉన్న గ్రామాలకు గాను కేవలం సుమారుగా 918 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు మాత్రమే ఉన్నాయి.
అయితే, కేంద్ర ప్రభుత్వం 2023లో ఒక పైలట్ ప్రాజెక్టుగా ‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగార ప్రణాళిక’ను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల స్థాయిలో గోదాములు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లతో సహా వివిధ వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రణాళికకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పరిచిన సదుపాయాలు జాతీయ సహకార డేటాబేస్ ప్రకారం మొత్తం 79,630 మంజూరయ్యాయి.
అందులో సుమారుగా 32,802 కొత్త పీఏసీఎస్, పాడి, మత్స్య సహకార సంఘాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 'ధాన్య నిల్వ ప్రణాళిక' కింద 560 సహకార సంఘాలను గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా 120 సహకార సంఘాలలో గోదాముల నిర్మాణం పూర్తయి.. మొత్తం 72,702 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఏర్పడింది. కానీ, గ్రామాల్లో నేటికీ సరిపడా గోదాంలు, నిల్వ కేంద్రాలు లేనందున గ్రామస్థాయిలో రైతులు పంట కోత తర్వాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి
నేడురైతులు ఎదుర్కొంటున్న పంటకోత అనంతర సమస్యలకు పరిష్కారం మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఆర్థికం అనే అంశాలను సమర్థవంతంగా నిర్వహించాలి. గ్రామస్థాయిలో ధాన్యం నిల్వకు కావలసిన మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, మండల స్థాయిలో ఆధునిక నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలు ఏర్పరచడం అవసరం. పంటకోత అనంతర నిర్వహణ కోసం, క్షేత్ర, మార్కెట్ స్థాయిల్లో మౌలిక సదుపాయాలు ముఖ్యమైనవి. క్షేత్రస్థాయిలో రైతులకు కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, ప్యాకేజింగ్ సామగ్రి సకాలంలో అందించాలి.
ఉత్పత్తులను మెరుగ్గా నిర్వహించడానికి ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో సేకరణ కేంద్రాలు, నిల్వ నిర్మాణాలు, ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం అత్యవసరం. మార్కెట్ మార్గాలలో ఆధునిక రిటైల్ మౌలిక సదుపాయాలతోపాటు తగినంత నిల్వ నిర్మాణాలు అవసరం. పంట కోత అనంతర సమస్యలు చాలా తక్కువ సమయంలో అధిక నష్టాలకు దారితీస్తాయి. వాటిని ఎదుర్కొనడంలో వేగవంతమైన, ప్రణాళికాబద్ధమైన ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి.
పంట కోత అనంతర నష్టాల సమస్యలను పరిష్కరించకపోతే, అధిక దిగుబడుల తర్వాత కూడా రైతులు పంట విలువను కోల్పోతూనే ఉంటారు. ఈ నష్టాలను తగ్గించడం వల్ల ఏటా బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. రైతుల ఆదాయం మెరుగవుతుంది. ఆహార ధరలు స్థిరంగా ఉంటాయి. జాతీయ ఆహార భద్రత బలోపేతం అవుతుంది.
డా. రేపల్లె నాగన్న
