ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో ఆగని వేట

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవిలో ఆగని వేట
  • ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న వన్యప్రాణుల వేట 
  •      ఇనుప తీగలు, విద్యుత్ కంచెలు అమర్చి హతమారుస్తుండ్రు
  •      జిల్లా వ్యాప్తంగా ఇటీవల పోలీసుల ఏకకాలంలో  దాడులు 
  •      పదిమంది వేటగాళ్ల అరెస్టు.. వన్యప్రాణుల అవయవాలు స్వాధీనం

ఆదిలాబాద్, వెలుగు:   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు పోలీసులు, అటవీశాఖ అధికారుల దాడుల్లో వేటగాళ్లు చిక్కుతున్నా వారి వేట మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎస్సీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో 30 బృందాలతో ఏకకాలంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలతో గ్రామాల్లోని వేటగాళ్ల బండారం బయటపడింది. జింకలు, అడవి పందులు, కుందేళ్లను విచ్చలవిడిగా వేడుతున్నట్లు తేలింది. వన్యప్రాణుల చంపి మాంసాన్ని పలు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వలతో పట్టి.. ఆయుధాలతో చంపి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో చాలా మంది పంట పొలాలు,  అడవుల సమీపంలోనే ఉన్నాయి. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చే వన్యప్రాణులను వేటగాళ్లు వలపన్ని పట్టుకుంటున్నారు. పంటలను దెబ్బతీస్తున్నాయనే సాకుతో కొందరు.. వేటనే వృత్తిగా చేసుకొని మరికొందరు అటవీ ప్రాంతాల్లో వలలు ఏర్పాటు చేసి అందులో పడ్డ వన్యప్రాణులను చంపేస్తున్నారు. మరికొందరు అడవుల్లో జంతువులు సంచరించే ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఉచ్చులు, ఇనుప తీగలు, విద్యుత్ కంచెలు అమర్చి దుప్పులు, అడవి పందులను హతమారుస్తున్నారు. 

వీరి ఉచ్చులకు తగిలి పులులు, చిరుతలు సైతం చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్​లో పోలీసుల దాడుల్లో వేటగాళ్ల దగ్గర కరెంట్ వైర్లు, బరిసెలు, కత్తులు, వలలు వంటి ఆయుధాలు పెద్ద ఎత్తున దొరికాయి.  జింక చర్మం, కొమ్ములు, నెమలి ఈకలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వన్యప్రాణుల వేట ఎంత పకడ్బందీగా చేస్తున్నారో  తెలుస్తోంది. రాత్రి సమయంలో హెడ్ లైట్లు పెట్టుకొని మరీ అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారు. ఎండాకాలంలో కావడంతో నీళ్ల కోసం నీటి కుంటల వద్దకు వస్తుండడంతో వాటి చుట్టూ కరెంట్​తీగలు ఏర్పాటుచేసి హతమార్చుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని సంఘటనలు

  • గతేడాది నవంబర్​లో జింకను, నెమళ్లను వేటాడిన బోరజ్ మండలంలోని గిమ్మ, జైనథ్ గ్రామానికి చెందిన ఇద్దరితో పాటు, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిని ఫారెస్ట్​ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్​లో అలుగును రూ.5 లక్షలకు విక్రయించే క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

 

  • ఈ ఏడాది మార్చిలో మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ తాళ్లపేట రేంజ్ పరిధిలో వేటగాళ్ల దాడిలో చిరుత పులి చనిపోవడం కలకలం రేపింది. చిరుత చర్మం, గోర్లు, ఇతర భాగాలు తీసుకొని దాని శరీరాన్ని కాల్చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వెంకటేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్​ను  పోలీసులు అరెస్ట్ చేశారు. 
  • ఈనెల 26న జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో 30 బృందాలతో వేటగాళ్ల కదలికలపై నిఘా పెట్టి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో నేరడిగొండ, తలమడుగు, బోథ్ మండలాల పరిధిలో వన్యప్రాణులను వేటాడి చంపిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి జింక కొమ్ములు, చర్మం, నెమలి ఈకలతో పాటు, హెడ్ లైట్లు, కరెంట్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. 
  • ఈనెల 29న గుడిహత్నూర్ మండల పరిధిలోని చిన్న మన్నూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన ఆదిలాబాద్​లోని పిట్టలవాడ కాలనీకి చెందిన నలుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కత్తులు, ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు.