నెలరోజులు AI వాడకానికి రూ.4వేల 750 కోట్లు బిల్లు పంపిన క్లాడ్.. కంపెనీకి దిమ్మతిరిగింది

నెలరోజులు AI వాడకానికి రూ.4వేల 750 కోట్లు బిల్లు పంపిన క్లాడ్.. కంపెనీకి దిమ్మతిరిగింది

ఈరోజుల్లో కంపెనీలకు ఏఐ టూల్స్ ఒక వరంగా మారాయి. కోడింగ్ రాయడం, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ వంటి పనులతో ఇవి ప్రొడక్టివిటీని భారీగా పెంచుతున్నాయి. అయితే వీటి వాడకంపై కన్నేసి ఉంచకపోతే ఎంతటి ఘోరం జరుగుతుందో చెప్పే షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీకి కేవలం ఒక్క నెలలోనే ఏఐ వాడినందుకు దాదాపు రూ.4వేల 750 కోట్లు బిల్లు వచ్చిందని అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఇంత భారీ బిల్లు చూసి ఆ కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టిందట.

దీనికి ప్రధాన కారణం ఆ కంపెనీ తమ ఉద్యోగుల ఏఐ వాడకంపై ఎలాంటి పరిమితులు, యూసేజ్ క్యాప్స్ విధించకపోవడమేనట. దాంతో ఉద్యోగులు క్లాడ్ ఏఐ చాట్‌బాట్ ను విచ్చలవిడిగా వాడేశారట. సాధారణంగా కార్పొరేట్ ఏఐ సేవలు 'టోకెన్' మోడల్ ఆధారంగా పనిచేస్తాయి. మనం ఇచ్చే ప్రతి ప్రాంప్ట్, ఏఐ ఇచ్చే సమాధానం టోకెన్ల రూపంలో లెక్కించబడుతుంది. పెద్ద కోడింగ్ ఫైల్స్, రీసెర్చ్ రిపోర్టులు విశ్లేషించినప్పుడు లక్షలాది టోకెన్లు ఖర్చవుతాయి. అందువల్ల కంపెనీ కొనుగోలు చేసిన లైసెన్స్ పరిమితి దాటిన వెంటనే అదనపు ఛార్జీలు కొండలా పేరుకుపోతాయి. ఈ కంపెనీ విషయంలోనూ అదే జరిగింది. ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఉద్యోగులు నాన్‌స్టాప్‌గా క్లాడ్‌ను వాడటం వల్ల బిల్లు అక్షరాలా రూ.4వేల 750 కోట్లు వచ్చింది అది కూడా కేవలం ఒక్క నెలకే. 

ఈ మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బిజినెస్‌లలో ఏఐ నిర్వహణ ఖర్చులపై సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ పెట్టుబడులు టాప్ ప్రయారిటీగా ఉన్నప్పటికీ.. రోజువారీ ఆపరేటింగ్ ఖర్చులను నియంత్రించడంపై కంపెనీలు ఇప్పుడు సీరియస్ ఫోకస్ పెట్టాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలే క్లాడ్ కోడ్ వంటి థర్డ్-పార్టీ ఏఐ టూల్స్ వాడకాన్ని తగ్గించడం ప్రారంభించాయి.

ఉద్యోగికి ఇంక్రిమెంట్స్ వేయమంటే లేదా బోనస్ అడిగితే నానా సాకులు చెప్పే కంపెనీలు ఏఐ వాడకం వల్ల వస్తున్న బిల్లులు చూసి షాకైపోతున్నాయని బయటకు వచ్చిన ఈ ఘటన నిరూపించింది. ఇంత భారీ స్థాయిలో బిల్లులు వస్తే ఏ కంపెనీ అయినా కుప్పకూలడం ఖాయమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఇలాంటి ఖరీదైన థర్డ్-పార్టీ ఏఐ టూల్స్ వాడకానికి పూర్తిగా దూరంగా జరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. బయటి సంస్థలపై ఆధారపడి ఇలా జేబులు గుల్ల చేసుకునే కంటే.. తమ అవసరాలకు తగ్గట్టుగా సొంత ఏఐ టూల్స్ డిజైన్ చేసుకోవడమే బెస్ట్ అని మెజారిటీ కంపెనీలు నమ్ముతున్నాయి. ఈ భారీ బిల్లు దెబ్బతో టెక్ పరిశ్రమలో సొంత ఏఐ మోడల్స్ అభివృద్ధి వేగవంతం కావడం పక్కా అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.