గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం భారతదేశానికి ఊహించని రీతిలో గ్యాస్, క్రూడ్ దిగుమతుల సమస్యను సృష్టించింది. దీంతో ఖతార్ లాంటి ప్రాంతాల నుంచి LPG, ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గిపోవటంతో కోట్ల మంది భారతీయులు తిప్పలు పడుతున్నారు. మరోపక్క వ్యాపారులైతే ఎక్కువ రేట్లకు అమ్మలేక, షాపులు మూసుకోలేక ఇబ్బంది పడుతున్నారు పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలతో. దీంతో మోడీ సర్కార్ దేశంలో LPG కనెక్షన్లకు సంబంధించిన రూల్స్ మార్పులు చేస్తోంది.
ప్రస్తుతం దేశంలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్(PNG) కనెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి మార్చి నెలాఖరు నాటికి సుమారు 6.5 లక్షల కొత్త కనెక్షన్లు ఏర్పాటయ్యాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ గ్యాస్ సరఫరా డిమాండ్ మాత్రం 18 శాతం తక్కువగా నమోదైంది. దీన్ని బట్టి చూస్తే.. చాలా కుటుంబాలు పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ.. ఎల్‌పీజీ సిలిండర్లను వాడటం పూర్తిగా మానేయలేదని స్పష్టమవుతోంది. గత దశాబ్ద కాలంలో ఎల్‌పీజీ వినియోగదారులు రెట్టింపై 33.5 కోట్లకు చేరగా, పీఎన్‌జీ యూజర్లు కేవలం 1.64 కోట్లుగానే ఉన్నారు. ఈ అలవాటును మార్చేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్ అమల్లోకి తెస్తోంది.
ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది 'ఒక ఇంటికి ఒకే కనెక్షన్' రూల్. ఇకపై ఒకే చిరునామాలో పీఎన్‌జీ, ఎల్‌పీజీ రెండు రకాల కనెక్షన్స్ కలిగి ఉండటాన్ని నిషేధంగా పరిగణిస్తారు. పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ.. ఇప్పటికీ ఎల్‌పీజీ వాడుతున్న వారు నిర్ణీత గడువులోగా మారకపోతే వారి ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోతుంది లేదంటే రద్దవుతుంది. పైప్‌లైన్ గ్యాస్ యాక్టివ్‌గా ఉన్న ఇళ్లకు సిలిండర్లను బుక్ చేసుకోకుండా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు తమ డిజిటల్ డేటాబేస్‌లను అనుసంధానించాయి. ఫలితంగా అలాంటి వారికి రీఫిల్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి.
అయితే వినియోగదారులకు ఊరటనిచ్చేలా 'ఎల్‌పీజీ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ ఓచర్' సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పీఎన్‌జీ కనెక్షన్ వచ్చిన 30 రోజుల్లోగా ఎల్‌పీజీని వదులుకోవాల్సి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారినప్పుడు ఈ ఓచర్ ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్‌ను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అలాగే సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రీఫిల్ బుకింగ్ లాక్-ఇన్ పీరియడ్‌ను పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ప్రభుత్వం ఏడాదికి అందించే 12 సబ్సిడీ సిలిండర్ల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ ధరలు, డిపాజిట్లు కూడా సవరించబడ్డాయి. పీఎన్‌జీ విస్తరణను మరింత వేగవంతం చేయడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఇటు కఠిన నిబంధనలు, అటు డిజిటల్ పర్యవేక్షణ ద్వారా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సో ఇకపై ఒకే ఇంటికి సిలిండర్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఏకకాలంలో కొనసాగించటం అస్సలు కుదరదన్నమాట.
