హనుమకొండ, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తున్నారని, రైతులకు ఆదాయం పెరగాలంటే పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు తదితర పప్పుదినుసుల సాగు వైపు మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని తెలిపారు.
సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం రైతులకు అందజేస్తున్నామని చెప్పారు. సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల సీడ్స్ కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలన్నారు. లైసెన్స్ కలిగిన ప్రతి డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
