ఇబ్రహీంపట్నం, వెలుగు: కిశోర బాలికల సాధికారతే సమాజాభివృద్ధికి పునాదని మంత్రి సీతక్క అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘బాలల మాక్ పార్లమెంట్- బాలల హక్కుల సదస్సు’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలు, విద్యాప్రారంభ సర్టిఫికేట్లను అందజేశారు. విద్యతో పాటు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతలను బాలికలు అలవర్చుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘స్నేహ’ కార్యక్రమంలో భాగంగా లక్ష మంది కిశోర బాలికలకు నాయకత్వ వికాసం, ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, కలెక్టర్ నారాయణ రెడ్డి, శృతి ఓజా, సదాలక్ష్మి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
