ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్

ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్
  • బీఆర్ఎస్​ హయాంలో సీఎస్​ఆర్ కింద ‘తత్వ’ సంస్థకు పనులు
  • చెరువు అభివృద్ధి పేరుతో 35.10 ఎకరాల భూమి ఆక్రమణ
  • ఆక్రమణల వెనుక రాజకీయ, సినీ ప్రముఖులు
  • పేదలతో గుడిసెలు వేయించి కబ్జా చేసే ప్రయత్నం
  • రూ.5,500 కోట్ల  భూమిని రక్షించిన హైడ్రా  

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ–నార్సింగి గ్రామాల పరిధిలోని ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. చెరువు మధ్యలో కట్ట నిర్మించి, పై భాగంలోని 35.10 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు వేసిన స్కెచ్​ను హైడ్రా బ్రేక్​చేసింది. సంబంధిత శాఖల సమక్షంలో చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్ హద్దులను నిర్ధారించి శనివారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా హైడ్రా రూ.5,500 కోట్లకు పైగా విలువైన భూమిని కాపాడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఆక్రమణ వెనుక రాజకీయ, సినీ ప్రముఖులు..

ముష్కిన్​ చెరువును సీఎస్​ఆర్ (కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ) కింద అభివృద్ధి చేసేందుకు నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం ‘తత్వ’ అనే సంస్థకు పనులు అప్పగించింది. అప్పట్లో నార్సింగి మున్సిపాలిటీ నుంచి పనులు దక్కించుకున్న ఈ సంస్థ చెరువును అభివృద్ధి చేసే పేరుతో  మట్టి నింపుతూ ఆక్రమణలకు పాల్పడింది. ఈ సంస్థ వెనుక పలువురు  రాజకీయ, సినీ ప్రముఖులు ఉండి వ్యూహాత్మకంగా చెరువు కబ్జాకు పాల్పడినట్లు తాజాగా తేలింది. ఇందులో భాగంగా చెరువు మధ్యలో కట్ట నిర్మించిన ఆక్రమణదారులు, ఎగువన ఉన్న భూముల్లో పేదలతో గుడిసెలు, చెత్త  వేరుచేసే షెడ్లు  ఏర్పాటు చేయించారు.

చెరువు మధ్యలో కట్ట కట్టడం, మట్టి నింపడం, చెత్తాచెదారం వేస్తుండడంతో స్థానికులు కొందరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు,  రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్లతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. గ్రామ రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 59.11 ఎకరాలు కాగా హెచ్‌‌‌‌ఎండీఏ లెక్కల ప్రకారం  52.20 ఎకరాల్లో ఎఫ్​టీఎల్​గా నిర్ధారించారు. సర్వే నంబర్ 259లో 20.23 ఎకరాలు (శిఖం భూమి), సర్వే నంబర్ 258 లో 13.34 ఎకరాలు (ఎఫ్‌‌‌‌టీఎల్), సర్వే నంబర్ 260 లో 8.19 ఎకరాలు (ఎఫ్‌‌‌‌టీఎల్), సర్వే నంబర్ 376 లో 12.80 ఎకరాలు (ఎఫ్‌‌‌‌టీఎల్ పరిధి), సర్వే నంబర్ 379 లో 29 గుంటలు (ఎఫ్‌‌‌‌టీఎల్) ఉండగా ఇందులో  35.10 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు గుర్తించారు.

దీంతో హైడ్రా గుడిసెల్లో ఉంటున్నవారితో సమావేశమైన చెరువు ఆక్రమణపై వారికి అవగాహన కల్పించారు. ఖాళీ చేసేందుకు రెండు నెలల గడువు ఇచ్చారు. 40 నుంచి 50 దాకా  గుడిసెలతో పాటు చెత్త వేరు చేసే షెడ్లను కూడా ఖాళీ చేశారు. అనంతరం శనివారం హైడ్రా ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఐటీ కారిడార్‌‌‌‌కు సమీపంలో ఉన్న చెరువును రక్షించడంపై స్థానికుల్లోహర్షం వ్యక్తమవుతోంది. తమ ఫిర్యాదు మేరకు హైడ్రాతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్​ అధికారులు చొరవ చూపి గుడిసెలు ఖాళీ చేయించడాన్ని  ప్రశంసిస్తున్నారు.