తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: సీఎం భజన్ లాల్ శర్మ

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: సీఎం భజన్ లాల్ శర్మ

కోదాడ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆయన చెప్పారు. మంగళవారం కోదాడ పట్టణంలో నల్లగొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  పార్టీ 70 ఏండ్ల పాటు పాలించినా దేశానికి చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం పూర్తిగా తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని, మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాలను అభివృద్ధి చేశామని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్  పార్టీ మోసం చేయాలని చూస్తోందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే  రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్  నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్  అయ్యారు. 

 తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. సుస్థిర పాలన అందించే సత్తా బీజేపీకే ఉందన్నారు. తమ అభ్యర్థి సైదిరెడ్డి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని  ఇవ్వకుండా కాంగ్రెస్  పార్టీ మోసం చేసిందన్నారు. తనను గెలిపిస్తే హుజూర్ నగర్  కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.