నీళ్ల కోసం.. ఊళ్ల మీద పడుతున్నయ్

నీళ్ల కోసం.. ఊళ్ల మీద పడుతున్నయ్
  •     లేగ దూడలపై దాడి చేస్తున్న చిరుతలు
  •     భయాందోళనలో పరిసర గ్రామాల రైతులు

కందనూలు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంత పరిసర గ్రామాలు, గిరిజన తండాల రైతులు చిరుతల దాడులతో వణికిపోతున్నారు. వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న దొడ్ల దగ్గర కట్టేస్తున్న పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. 2,600 ఎకరాల్లో విస్తరించిన గంగారం అడవిలో వన్యమృగాలకు ఆహారం, తాగునీటి కొరత ఎదురవుతుండడంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. చెట్లు పల్చబడి వన్యప్రాణుల సంఖ్య తగ్గడం, నీటి కొరత కారణంగా చిరుతలు తరచుగా గిరిజన తండాలు, గ్రామాల మీదికి వస్తున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు.

తాగునీళ్లు అందట్లే..

బిజినేపల్లి మండలంలోని గంగారం, లటుపల్లి, మమ్మాయిపల్లి ప్రాంతాల మధ్య విస్తరించిన అడవిలో వన్యప్రాణులు, అటవీ జంతువుల కోసం ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ మూడు సోలార్​ పంప్​సెట్లు, వాటర్ సాసర్​ పిట్లు ఏర్పాటు చేసింది. గంగారం ఫారెస్ట్ చుట్టూ వస్త్రం తండా, భీముని తండా, పెద్ద పీరు తాండా, అలుగుతండా, కీమ్య తండా, కట్రావత్ తండాలు ఉన్నాయి.

అడవిలో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు వాటర్​ సాసర్లు, 20 నీటి కుంటలు, 15 చెక్ డ్యాములు, 3 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత కారణంగా అవసరం మేర నీరందించలేని పరిస్థితి ఉంది. ఈ ఫారెస్ట్ లో చిరుతల సంఖ్య ఏడుకు పెరగగా, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో నీళ్లు, ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయని పరిసర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ నెలలో రెండు దూడలను చిరుతలు చంపేశాయి. దీంతో గ్రామస్తులు అడవిలోకి ఒంటరిగావెళ్లొద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉంటే అటవీ ప్రాంతాన్ని డెవలప్​ చేయడంతో పాటు ఆహారం, తాగునీటి కొరత తీర్చి చిరుతలు, హైనాలు పశువులపై దాడులు చేయవని అంటున్నారు. 

అవగాహన కల్పిస్తాం.. 

ఫారెస్ట్ లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో చిరుతల సంచారం పెరిగింది. వాటి దాహార్తి తీర్చేందుకు సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేశాం. చిరుతల దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం అందజేస్తాం. అడవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వన్యప్రాణులు, అటవీ జంతువులకు హానీ తలపెట్టవద్దు. తండావాసులకు దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
- పర్వేజ్​ అహ్మద్, ఎఫ్ఆర్వో, గంగారం