రైతు భరోసాకు ఈసీ బ్రేక్

రైతు భరోసాకు ఈసీ బ్రేక్
  • రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం 
  • ఇప్పటికే 97 శాతం మంది రైతులకు పంపిణీ  
  • మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమ 

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్ సభ ఎన్నికలు ఉన్నందున, అవి ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్​రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ఎన్.వేణుకుమార్ అనే వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. లోక్‌‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయవద్దని, పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు పంపిణీ చేయాలని ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని  రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, పథకం అమలుపై సాయంత్రానికల్లా రిపోర్టు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది.

‘‘రైతు భరోసా పథకాన్ని ఆన్ గోయింగ్ స్కీమ్‌‌‌‌గా భావించి నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చాం. అయితే సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఇటీవల పలు బహిరంగ సభల్లో మే 9 కల్లా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇలా బహిరంగంగా చెప్పడం కోడ్ ఉల్లంఘనే అవుతుంది. పోయినేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ప్రభుత్వానికి రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చాం. కానీ అప్పటి మంత్రి హరీశ్‌‌‌‌ పలు సభల్లో దీని గురించి ప్రస్తావించడంతో ఆ తర్వాత అనుమతిని ఉపసంహరించాం. సాధారణంగా యాసంగి సీజన్ రైతుబంధు నవంబర్–-జనవరి మధ్య ఉంటుంది. నిర్దిష్టమైన తేదీలను నిర్దేశించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చాం. కానీ సీఎం రేవంత్ ఇటీవల చేసిన కామెంట్లు కోడ్ ఉల్లంఘన కిందకు రావడంతో పాటు కంప్లయింట్​కూడా అందడంతో ఆంక్షలు విధించక తప్పడం లేదు” అని ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. కాగా, ఈ నెల 6న ఈసీకి వేణుకుమార్ నుంచి కంప్లయింట్​అందింది. 

3 లక్షల మందికి పెండింగ్.. 

యాసంగి సీజన్‌‌‌‌ రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం నిధులు సిద్ధం చేసుకున్న తర్వాత ఈసీ బ్రేకులు వేసింది. ఈ నెల 6న నాలుగు ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న  రైతులకు పెట్టుబడి సాయం జమ అయింది. మంగళ, బుధవారాల్లో మొత్తం పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈలోపే ఈసీ ఆంక్షలు విధించింది. అయితే ఇప్పటికే 97 శాతం మంది రైతులకు రైతు భరోసా అందింది. రాష్ట్రంలో యాసంగి సీజన్​లో రైతు భరోసా అందించాల్సిన రైతుల సంఖ్య 68.99 లక్షలు. వీళ్లకు 1.52 కోట్ల ఎకరాలకు గాను రూ.7,625 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 8 ఎకరాల వరకున్న దాదాపు 66 లక్షల మంది రైతులకు రూ. 6,319 కోట్ల నిధులు అందాయి. మిగిలిన రైతులకు ఇంకా రూ.1,200 కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. వీళ్లందరికీ ఈ నెల 13 తర్వాత జమ చేయనున్నారు.