ఇండ్లు బాగు చేసేందుకు ‘రిపేర్ టుగెదర్’

ఇండ్లు బాగు చేసేందుకు ‘రిపేర్ టుగెదర్’

కూలిన గోడలు, దెబ్బతిన్న ఇండ్లు, నేలమట్టమైన షాపింగ్ మాల్స్​... చెల్లాచెదురుగా పడిఉన్న మట్టిపెళ్లలు, సిమెంట్ దిమ్మెలు... ఇలాంటి చోటే​ వీళ్లకు పార్టీ ప్లాట్​ఫామ్స్. అక్కడే మ్యూజిక్ వింటూ  హుషారుగా డాన్స్ చేస్తారు. వీళ్లందరూ ఉక్రెయిన్​కి చెందిన యువత. ఈ డాన్స్​ పార్టీ వెనక.. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఇండ్లని బాగు చేసుకుంటున్న వాళ్లకు సాయపడాలనే మంచి ఆలోచన ఉంది. 

రష్యా సైనికుల మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్​లోని సిటీలు, ఊళ్లలో చాలా ఇండ్లు కూలిపోయాయి. వాటిని రిపేర్ చేసేందుకు  దాచుకున్న పైసలు, పెన్షన్​ డబ్బులు చాలక ఇబ్బంది పడుతున్నారు చాలామంది. వాళ్లకు తమ వంతు సాయం చేయాలనుకున్నారు అక్కడి యంగ్​స్టర్స్. 200 మంది కలిసి ‘రిపేర్ టుగెదర్’ అనే గ్రూప్​గా ఏర్పడ్డారు. అందులో  నైట్​క్లబ్స్​లో మ్యూజిక్ వినేందుకు వెళ్లే వాళ్లే ఎక్కువ. డాన్స్​ పార్టీలు మిస్​ అయిన ఫీలింగ్ రాకుండా ఉండేందుకు కూలిపోయిన బిల్డింగ్స్​ దగ్గరే డాన్స్​ పార్టీలు పెడుతున్నారు. వాళ్ల ఆలోచన నచ్చి, చాలామంది డొనేషన్స్​ ఇస్తున్నారు. ఆ డబ్బుని ఇండ్లను రిపేర్ చేసేందుకు ఖర్చు చేస్తున్నారు వీళ్లు. 

15 ఇండ్లను రిపేర్ చేశారు

ముందుగా పారలు అందుకొని కూలిన ఇండ్లలోని మట్టి, సిమెంట్ పెళ్లల్ని  ఒకచోట కుప్పగా పోస్తారు. అక్కడే  డీజె, మ్యూజిక్​ బాక్స్​లు పెట్టి డాన్స్ చేస్తారు.  డాన్స్​ పార్టీల ద్వారా వచ్చిన డబ్బుతో  యహిడ్నె అనే ఊళ్లో  కల్చరల్ సెంటర్​ని బాగు చేశారు. ‘రిపేర్ టుగెదర్​’లో ఇది వాళ్ల ఎనిమిదో ప్రాజెక్ట్. ఇప్పటివరకు ఆ గ్రామంలో 15 ఇండ్లను బాగు చేశారు. మరో 15 ఇండ్ల తలుపులు, కిటికీలు రిపేర్ చేశారు. మరో 12 ఇండ్లు బాగు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీళ్లకు సపోర్ట్​గా  ఉండి పనిచేసేందుకు పోర్చుగల్, అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్ నుంచి కొందరు యంగ్​స్టర్స్​ చేరారు. 

ఇప్పుడు ఇదే నార్మల్ లైఫ్​

‘‘నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ,  రష్యా యుద్ధం వల్ల పార్టీలని మిస్​ అవుతున్నాం. మునపటిలా భయం లేకుండా హాయిగా బతికే రోజులు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే మాకు నార్మల్ లైఫ్​ అంటే వలంటీర్​గా పనిచేయడమే. బాంబు దాడుల్లో చాలా ఇండ్లు కూలిపోయాయి. ప్రజలకు  చేతనైన సాయం చేయాలనుకున్నాం. అందుకోసం మ్యూజిక్ పార్టీలు పెడుతున్నాం’’ అంటున్నాడు  ‘రిపేర్ టుగెదర్​’ కార్యక్రమం ఆర్గనైజర్ టానియా బురియనొవ.