ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: మంత్రి సీతక్క

 ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: మంత్రి సీతక్క

ప్రధాని మోదీపై మంత్రి సీతక్క ఫైరయ్యారు.  దేశంలో మోదీ పాలనలో ఏ ఒక్క గ్రామానికి సరైన రోడ్లు వేయలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని అనడం, భారత రాజ్యాంగం మార్చుతానని అహంకార మాటలు మాట్లాడుతున్న మోదీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
   
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా  కెరమెరి మండల కేంద్రంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఏఐసిసి జనరల్ సెల్రటరీ‌‌ కెసి.వేణుగోపాల్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..  ఓట్లు కోసం దేవుళ్లని వాడుకుంటున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం.. ఊర్లో గుడి కట్టలేదు.. కానా ఊర్లో డబ్బులు వసూలు చేసి అయోధ్యలో మందిరం కట్టారన్నారు. ప్రవేటీకరణ అంటే ముందు మోదీ.. వెనకాల అంబానీ, అదనీలు ఉన్నారని చెప్పారు.

పదేళ్ళ  బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు సీతక్క. అహంకార, కుటుంబ పాలనను చూసిన ప్రజలు బీఆర్ఎస్ ను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. ఓట్లు ఉన్నప్పుడే కేసీఆర్ బయటకు వస్తారని... ఆ తర్వాత మళ్ళీ ఫాం హౌస్‌ లో కుంభకర్ణ నిద్రలోకి జారుతాడని విమర్శించారు.  గులాబీ పాలకుల అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందన్నారు.  డబ్బులు లేక రైతు బందు అగిందని..  రైతులకు ఖచ్చితంగా రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ అంటే పరిపాలకులంకాదు,ప్రజా సేవకులమన్నారు. బడుగు, బలహీన వర్గాల వారందరికి సమానంగా చూసేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి సీటు గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపునిచ్చారు.