చందమామపై మంచు

చందమామపై మంచు
  • జాబిలి దక్షిణ ధ్రువంపై తాజా మంచు

చందమామపై కొత్తగా మంచు ఏర్పడుతోందట. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చిన్న చిన్న లోయల్లో ఇటీవలికాలంలోనే ఏర్పడిన తాజా మంచు ఉందట. అంతరిక్షం నుంచి చాలా చిన్న ఉల్కలు వచ్చి పడటం వల్ల లేదా సూర్యుడి నుంచి వచ్చే సౌరగాలుల ప్రభావంతో ఈ మంచు ఏర్పడి ఉంటుందని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ రీసెర్చర్లు అంటున్నారు. ఈ మంచు ఎలా ఏర్పడుతోందో తెలుసుకుంటే భవిష్యత్తులో మనుషులు అక్కడ ఉండేందుకు మార్గం దొరికినట్లేనని వారు చెబుతున్నారు.

310 కోట్ల ఏండ్ల నుంచే మంచు..

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారీ లోయలు ఉంటాయి. ఇవి సుమారుగా310 కోట్ల ఏండ్ల కిందటే పెద్ద పెద్ద గ్రహశకలాలు, ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయి. వీటిలో మంచు కూడా దాదాపుగా అప్పటి నుంచే ఉందని సైంటిస్టుల అంచనా. అయితే, కొత్తగా ఏర్పడిన ఐదారు మీటర్ల గుంతల్లోనూ మంచు ఉన్నట్లు తమ రీసెర్చ్‌‌లో తేలిందని బ్రౌన్ యూనివర్సిటీ రీసెర్చర్ ఏరియల్ డ్యూష్​ వెల్లడించారు. తాము నాసా సైంటిస్టులతో కలిసి రీసెర్చ్ చేయగా.. చంద్రుడిపై తాజా మంచు సంగతి తెలిసిందని ఆమె తెలిపారు.  అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) అందించిన డేటాను విశ్లేషించగా చిన్న చిన్న క్రేటర్లలో మంచు ఇటీవలి కాలంలోనే ఏర్పడినట్లు తెలిసిందన్నారు. ‘‘చంద్రుడిపై అగ్నిపర్వతాల పేలుళ్లు వంద కోట్ల ఏండ్ల కిందటే ఆగిపోయాయి. ఈ క్రేటర్లు కూడా కొత్తవి. అందుకే గ్రహశకలాలు, తోకచుక్కలు, అగ్నిపర్వతాల వల్ల కాకుండా ఈ మంచు వేరే మార్గంలో  ఏర్పడి ఉంటుంది. బహుశా బఠానీ గింజంత సైజులో ఉండే ఉల్క ముక్కలు రాలడం వల్ల లేదా సౌర గాలుల వల్ల ఈ మంచు ఏర్పడి ఉంటుంది. అయితే, అక్కడ మంచు ఎలా? ఎంత ఏర్పడుతోంది? అన్నది తెలిస్తేనే.. దానిని ఎలా వాడుకోవచ్చన్నది తెలుస్తుంది” అని వివరించారు.