
- సిటీ అంతా ఆగమాగం
- ఘట్‌కోపర్‌లో కూలిన బిల్‌బోర్డ్
- తొమ్మిది మంది మృతి.. 70 మందికి గాయాలు
- గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
- ముంబై ఎయిర్పోర్టులో నిలిచిన విమానాల రాకపోకలు
ముంబై: మహారాష్ట్రంలోని ముంబైలో గాలిదుమారం బీభత్సం సృష్టిస్తున్నది. ఈదురు గాలులతో పడిన వర్షానికి ఘాట్‌కోపర్‌లోని ఫ్యూయెల్ స్టేషన్ వద్దనున్న భారీ బిల్‌బోర్డ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా..మరో 70 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కొన్ని కార్లు కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. బిల్‌బోర్డ్ కింద మరికొంత మంది చిక్కుకుపోయారని వివరించారు. వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని వివరించారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
జనజీవనం అస్తవ్యస్తం
ముంబైలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చెలరేగిన గాలిదుమారానికి వెదర్‌లో ఆకస్మికంగా మార్పులు వచ్చాయి. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ఏరియాల్లో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. గాలిదుమారం, వర్షం కారణంగా నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. ముంబై, థానే, పాల్ఘర్ లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. గంటకు 50 నుంచి-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా.. ఈ సీజన్లో తొలి వర్షం పడటంతో ముంబై ప్రజలు వేడి నుంచి కాస్త రిలీఫ్ పొందారు.