
- లిక్కర్ స్కామ్‌కేసులో మార్చి 15న అదుపులోకి తీసుకున్న ఈడీ
- తీహార్ జైల్లో ఉండగానే అరెస్టు చేసిన సీబీఐ
- ఈడీ కేసులో నేడు కోర్టు ముందుకు కవిత
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి బుధవారంతో రెండు నెలలు అవుతుంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమెను మంగళవారం రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు జైలు సిబ్బంది ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈడీ కేసులో ఈ నెల 7న కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ టైం మంగళవారంతో ముగియనుంది. దీంతో కవితను జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపర్చనున్నారు. మార్చి 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి రాత్రికి ఢిల్లీకి తరలించారు.
మార్చి 16న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది. ఆమె నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని తెలిపింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. అనంతరం మార్చి 26న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే... ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా... కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ఉంది.
దాదాపు 46 రోజులుగా తీహార్ జైల్లోనే
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 46 రోజులుగా కవిత తీహార్ జైల్లోని కాంప్లెంక్స్ 6 (మహిళ ఖైదీలు ఉండే కాంప్లెక్స్) లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. కాగా తనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
రెండుసార్లు కవితతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్!
తీహార్ జైలులో వారానికి రెండు సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ (నేరుగా, వీడియో కాల్ ద్వారా) అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడే అవకాశం కుటుంబసభ్యులకు ఉంది. దీంతో కేసీఆర్ రెండుసార్లు కవితతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.
కస్టడీ పొడిగింపుపై నేడు విచారణ
లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ అడ్వకేట్లు కోర్టును కోరనున్నారు. ఈ నెల 10న కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను ట్రంకు పెట్టలో కోర్టులో సమర్పించింది. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల టైంలోపు చార్జ్ షీటు దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. కాగా, మంగళవారం జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు విచారణ సందర్భంగా... చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ అడ్వకేట్లు కోరనున్నట్లు తెలిసింది.
,