- నేడు తుది జాబితా ప్రకటన
- మార్పులు, చేర్పులపై కసరత్తు
- ఇంటింటికి వెళ్లి అభ్యంతరాల పరిశీలన
- మున్సిపల్ ఎన్నికల కోసం గుర్తుల ఖరారు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. రెండు మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. నేడు తుది ఓటర్ జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. 13న పోలింగ్‌స్టేషన్ల వారీగా ముసాయిదా ప్రచురిస్తారు. 16న వార్డుల వారీగా పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల వివరాలతో జాబితాలను టీ- పోల్ వెబ్‌పైట్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అభ్యంతరాల పరిశీలన పూర్తి
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు రావడం, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లడం, ఇతర ప్రాంతాల ఓటర్లు ప్రత్యక్షం కావడంతో వాటిని మార్చేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటున్నారు. తప్పిదాలు ఎలా జరిగాయనే విషయంపై పరిశీలించి మార్పులు, చేర్పులపై చర్యలు ప్రారంభించారు. వార్డుల వారీగా ఇంటి నంబర్లు పరిశీలించి అయా వార్డుల్లోనే ఓటర్లు ఉండేలా చూస్తున్నారు. తుది జాబితాను ప్రకటించేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
గుర్తుల ఖరారు
ఎన్నికల కమిషన్ ఏర్పాట్లలో మరింత వేగాన్ని పెంచుతూ అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను ప్రకటించింది. జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తింపు సింబల్స్ కేటాయిస్తారు. స్వతంత్రులుగా బరిలో నిలిచేవారికి గుర్తులు కీలకంగా మారుతాయి. ఎన్నికల కమిషన్ ఐదు జాతీయ పార్టీలు, నాలుగు రాష్ట్ర పార్టీలు, మరో నాలుగు రిజిస్టర్ పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 గుర్తులను ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత రిటర్నింగ్‌అధికారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీలు ఇచ్చిన బీఫామ్ ప్రకారం గుర్తింపు పార్టీల గుర్తులు కేటాయిస్తే స్వతంత్రులుగా ఉన్నవారికి అక్షర క్రమంలో ప్రీ సింబల్స్ కేటాయిస్తారు.
స్వతంత్ర అభ్యర్థుల కేటాయించే గుర్తులు ఇవే..
స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో ఎయిర్‌కండిషనర్, యాపిల్, గాజులు, పండ్లబుట్ట, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైనాక్యులర్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారంబోర్డ్, చెయిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు, సాసర్, కటింగ్‌ప్లేయర్, డ్రిల్లింగ్‌మెషిన్, డంబెల్స్, విద్యుత్‌స్తంభం, ఎన్వలప్‌కవర్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, ఫుట్బాల్‌ఆటగాడు, గౌను, గరాటా, గ్యాస్‌సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గ్రామ్‌ఫోన్, ద్రాక్ష పండ్లు, పచ్చిమిరపకాయ, తోపుడు బండి, హెడ్‌ఫోన్, హాకీ కర్ర-బంతి, పనసపండు, బెండకాయ, పోస్ట్‌డబ్బా, గొళ్లెం, లూడో, అగ్గిపెట్టె, మైక్, ముకుడు, ప్యాంట్, పెన్‌డ్రైవ్, అనాస పండు, కుండ, ప్రెషర్‌కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, సేఫ్టీపిన్, కుట్టు మిషన్, కత్తెర, నౌక, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, స్విచ్‌బోర్డ్, టేబుల్, టెలిఫోన్, టూత్‌బ్రష్, ట్రంపెట్, టైర్స్, వయోలిన్, వాల్‌నట్, వాటర్‌మిలన్, బావి, ఈల, ఊలు-సూది గుర్తులు ఖరారు చేశారు.
