హైదరాబాద్ శివారు హోర్డింగులపై నో క్లారిటీ..అనుమతులు ఒకలా.. ఏర్పాటు మరోలా..

హైదరాబాద్  శివారు హోర్డింగులపై నో క్లారిటీ..అనుమతులు ఒకలా.. ఏర్పాటు మరోలా..
  • విలీనంతో అడ్వరైజ్​మెంట్​ పాత పాలసీ రద్దు  
  • కొత్త పాలసీ రాకపోవడంతో ఇబ్బందులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  బల్దియాలో విలీనమైన శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున అక్రమ హోర్డింగ్‌‌‌‌ల దందా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని మెయిన్​రోడ్లు, ఎయిర్‌‌‌‌పోర్ట్ రూట్లు, నివాస ప్రాంతాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ సైజ్ యూనిపోల్ హోర్డింగ్‌‌‌‌లు వెలుస్తున్నాయి. ఇంతకుముందు సర్కారు జాగాలను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్​లపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. తొలగింపు కార్యక్రమం చేపట్టింది. 

కొన్ని రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతాల్లో మళ్లీ హోర్డింగ్​లు ఏర్పాటవుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్​లపై బల్దియా స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తూ తొలగిస్తుండగా, విలీనం తర్వాత పాత అడ్వర్టైజ్మెంట్ పాలసీ రద్దు కావడం, కొత్త పాలసీ ఇంకా రాకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నది. 

నిబంధనలకు విరుద్ధంగా..

రూల్స్ ​ప్రకారం.. 40×40 అడుగుల హోర్డింగ్‌‌‌‌లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, కొన్ని యాడ్ ఏజెన్సీలు 80×40, 100×40 అడుగుల భారీ యూనిపోల్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే, నివాస భవనాల పై భారీ హోర్డింగ్‌‌‌‌లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమైనా శివార్లలో కొన్నిచోట్ల భారీ హోర్డింగ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

మెయిన్​రోడ్లకు అతి దగ్గరగా భారీ యూనిపోల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈదురుగాలులు వీచినప్పుడు, వర్షాల టైంలో అవి కూలిపడి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. గతంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. స్థానిక మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ కొన్ని యాడ్ ఏజెన్సీలు అక్రమ ఈ హోర్డింగ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.  

విలీనం తర్వాత గందరగోళం..

విలీనమైన మున్సిపాలిటీల్లో ఇదివరకే హోర్డింగ్స్​కు అక్కడి అధికారులే అనుమతులు ఇఇచ్చారు. అయితే, జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనం తర్వాత ఇప్పటివరకు సమగ్రంగా కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ అమలులోకి రాలేదు. పాత బల్దియా పరిధిలో అడ్వర్టైజ్మెంట్ పాలసీని పూర్తిగా రద్దు చేసిన బల్దియా కొత్త పాలసీకి సంబంధించి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న యాడ్ ఏజెన్సీలు రెచ్చిపోతున్నాయి.

 విలీనానికి ముందు ఒక్క హోర్డింగ్‌‌‌‌కు పర్మిషన్ తీసుకుని, ఇప్పుడు ఐదారు హోర్డింగ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. శివారులోని ఏ ప్రాంతంలో ఎంత సైజ్ హోర్డింగ్‌‌‌‌కు అనుమతి ఇవ్వాలి? యూనిపోల్స్‌‌‌‌కు స్పష్టమైన మార్గదర్శకాలు ఏమిటి? నివాస ప్రాంతాలు, రోడ్ల పక్కన నిషేధాలు ఎలా అమలు చేయాలి? అనే అంశాల్లో స్పష్టత లేకపోవడంతో యాడ్​ఏజెన్సీల దందా యథేచ్ఛగా నడుస్తోంది.