ఈసారి చాన్స్ ఎవరికీ ?.. గడిచిన రెండు టర్ములు నిజామాబాద్ మేయర్ పదవి మహిళలకే

ఈసారి చాన్స్ ఎవరికీ ?.. గడిచిన రెండు టర్ములు నిజామాబాద్ మేయర్ పదవి మహిళలకే
  • మున్సిపాలిటీల్లోనూ మహిళా చైర్​పర్సన్​లే..
  • మేయర్, చైర్మన్​ పీఠాలపై కన్నేసిన ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్​
  • తమకు కలిసిరాకుంటే భార్యలను బరిలో దింపేందుకు ప్లాన్​ 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ మేయర్, మున్సిపాలిటీల చైర్​పర్సన్లుగా రెండు టర్ములు మహిళలే కొనసాగారు. పదేండ్లు మహిళలకే అవకాశం దక్కగా, ఈసారైనా మగవాళ్లకు చాన్స్​దక్కుతుందా.. లేదా.. అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల నేతల్లో రిజర్వేషన్​టెన్షన్​మొదలైంది. తమకు రిజర్వేషన్​ అనుకూలంగా రాకపోతే తమ సతీమణులను బరిలో దింపేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాయంత్రాంగం ముసాయిదా ఓటరు లిస్ట్​ను ప్రకటించగా, తుది ఓటరు జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. 

గడిచిన పదేండ్లూ మహిళలే.. 

జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. జనవరి 2025 వరకు రెండు టర్ములు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే నిజామాబాద్ మేయర్‌లుగా కొనసాగారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా పదేళ్ల పాటు బీసీ మహిళలే చైర్‌పర్సన్‌లుగా పాలన కొనసాగించారు. 2018లో కొత్తగా ఏర్పాటైన భీంగల్ మున్సిపాలిటీని కూడా బీసీ మహిళలకు కేటాయించడంతో ఇద్దరు మహిళలు టర్మ్​ పంచుకున్నారు. బోధన్ మున్సిపాలిటీలో గత ఐదేళ్లుగా బీసీ మహిళే చైర్‌పర్సన్‌గా పని చేయగా, అంతకుముందు టర్మ్​లో ఐదేళ్లపాటు ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయినా చైర్‌పర్సన్ పదవిలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత కొనసాగారు. 

ఇప్పుడెలా ఉండబోతుంది ? 

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముసాయిదా ఓటర్ లిస్టును ప్రకటించిన అధికారులు, ఈ నెల 12న వార్డు, డివిజన్‌ల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేయనున్నారు. దీని తర్వాత కీలకమైన రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా అటు వైపే మళ్లింది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ ను ఈసారి కూడా కొనసాగిస్తారా? లేక ఒకే కేటగిరీకి పదేళ్లపాటు రిజర్వేషన్ అమలవుతుందా ? అనే సందేహాలతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా రాకపోతే భార్యలను బరిలో దించేందుకు చాలా మంది నేతలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.

అదీ కుదరకపోతే పక్క వార్డులకు షిఫ్ట్ కావాలన్న ఆలోచనలోనూ ఉన్నారు. ముఖ్యంగా మేయర్‌, చైర్‌పర్సన్ పదవులను దక్కించుకోవాలని ఆశతో ఉన్న నేతల్లో ఈ టెన్షన్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలకు ఏ స్థానాలు కేటాయిస్తారు? పురుషులకు ఎన్ని అవకాశాలు దక్కుతాయి? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలతో కూడిన చర్చ కొనసాగుతోంది.