వసూలైన ఆస్తి పన్ను రూ.2,184 కోట్లు : జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

వసూలైన ఆస్తి పన్ను రూ.2,184 కోట్లు : జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
  • 3 కార్పొరేషన్లలో ఓటీఎస్​తో రూ.322.89 కోట్ల కలెక్షన్​ 
  • ఈ నెల 31 వరకు గడువు
  • జీహెచ్​ఎంసీ కమిషనర్ ​కర్ణన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు :  ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 15వ తేదీ రూ.2,184 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని జీహెచ్ఎంసీ కమిషన్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించేందుకు అవకాశం ఇచ్చామని, ఈ నెల31 వరకు గడువు ఉందన్నారు.

ఓటీఎస్​ ద్వారా ఇప్పటివరకు 2,67,153 ప్రాపర్టీ దారుల నుంచి రూ.322.89 కోట్లు ఆస్తి పన్ను వసూలైందన్నారు. మూడు కార్పొరేషన్లలో కలిపి 28,80,260 ఆస్తులు ఉండగా, 18 లక్షల ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చిందన్నారు. ఈ నెల 15 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ.2,985 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 823 కోట్లు, సీఎంసీలో రూ.1,657 కోట్లకు రూ.885, ఎంఎంసీలో రూ.1,745 కోట్లకు గాను రూ.478 కోట్లు మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో రూ.6,387 కోట్లకు రూ.2,186 కోట్లు వచ్చిందన్నారు.

సర్కిల్, జోన్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి నోటీసులు ఇస్తున్నామని, స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాల ఆస్తి పన్ను దశల వారీగా చెల్లిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తిపన్నులను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

జీఐఎస్ సర్వే ద్వారా నగరంలో చాలా ఆస్తుల ప్రాపర్టీల డిఫరెన్స్ ఉన్నట్లు గుర్తించామని, ఇలా తేడా ఉన్న లక్షా 20 వేల ఆస్తులకు నోటీసులు ఇచ్చామన్నారు. ఏప్రిల్1 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా మారుతుందో ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుందన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ తో  గ్రేటర్ పరిధిలో చాలా మార్పులు వస్తాయన్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు ఉండొద్దన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.  రెవెన్యూ అడిషనల్ కమిషనర్ ప్రియాంక అల, శానిటేషన్ అడిషనల్  కమిషనర్ రవి కిరణ్ పాల్గొన్నారు.