- బస్సుల్లో 50% అదనపు చార్జీలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు టీజీఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 17, 18వ తేదీల్లో అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పండుగ ముగిసిన తర్వాత ప్రయాణికులు తిరిగి వచ్చేందుకు వీలుగా ఈ నెల 23న కూడా ప్రత్యేక సర్వీసులను నడపనున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
