అక్రమ పట్టా చేశారని..పెట్రోల్ బాటిల్ తో కలెక్టరేట్ పైకి ఎక్కిన యువకుడు.. ఎక్కడంటే..!

అక్రమ పట్టా చేశారని..పెట్రోల్ బాటిల్ తో కలెక్టరేట్ పైకి ఎక్కిన యువకుడు.. ఎక్కడంటే..!
  • హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

హనుమకొండ, వెలుగు: తమ భూమిని ఇతరుల పేరిట అక్రమంగా పట్టా చేశారని, ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధర్మసాగర్  మండల కేంద్రానికి చెందిన పయ్యావుల సాంబరాజు సోమవారం పెట్రోల్  బాటిల్ తో హనుమకొండ కలెక్టరేట్  పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.

దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పి యువకుడిని కిందికి దించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ధర్మసాగర్ లో సర్వే నంబర్​ 1146/ఏలోని తమ భూమిని తహసీల్దార్​ ఇతరుల పేరు మీద పట్టా చేశాడని ఆరోపించాడు. ఈ విషయమై గతంలో కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశామని తెలిపాడు. అక్రమ పట్టా పొందిన వారు భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని వాపోయాడు.

సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు అన్యాయం చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్​ చేశాడు. అనంతరం పోలీసులు బాధితుడిని కలెక్టర్  చాహత్  బాజ్ పాయ్  వద్దకు తీసుకెళ్లారు. బాధితుడి వినతిపత్రాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఆమె సూచించారు.