పంజాగుట్ట, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా అలీన విధానం ప్రస్ఫుటించేలా భారత్ చర్యలు ఉండాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, సీపీఐ కార్యదర్శి నారాయణ కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘వార్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా’ అంశంపై నిర్వహించిన ఆల్ పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. యుద్ధంపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
యుద్ధాన్ని కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణగా మాత్రమే చూడకూడదని, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ స్పందించాలని సూచించారు. సుమారు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారన్నారు. యుద్ధంతో ప్రపంచ దేశాలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మిడిల్ ఈస్ట్ దేశాలతో హైదరాబాద్‌కు పూర్వం నుంచే సంబంధాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా తెలిసేలా చారిత్రాత్మక యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలను నగరం నుంచే భారీ స్థాయిలో ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 18న నగరంలోని ముగ్దుంభవన్‌లో అన్ని వర్గాలు, రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ నాయకులు శోయబ్ అలీ ఖాన్, టీజేఎస్ నేత మహ్మద్ అఫ్జల్, మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్, సీపీఐ నాయకులు అన్వేష్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
