చెవికి బ్లూటూత్ ముప్పు..! ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు.. ఇంత సౌండ్ వింటే కర్ణభేరి ఖతమే..! 

చెవికి బ్లూటూత్ ముప్పు..! ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు.. ఇంత సౌండ్ వింటే కర్ణభేరి ఖతమే..! 
  • 80 డెసిబుల్స్ దాటి సౌండ్ వింటే కర్ణభేరి ఖతమే 
  • చెవిలో గాలి ఆడక చేరుతున్న బ్యాక్టీరియా, చీము 
  • నిరంతరం బ్లూటూత్ వాడకంతో ‘టినైటస్’ సమస్య 
  • చెవిలో ఎప్పుడూ ఏదో తెలియని రింగింగ్ శబ్దం 
  • పడుకునేటప్పుడు బడ్స్ వాడితే రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం 
  • నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత తగ్గడానికి కారణమవుతున్న వైర్​లెస్ హెడ్ ఫోన్లు
  • 60/60 ఫార్ములా పాటించాలని సూచిస్తున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు:  మీరు నిత్యం  బ్లూటూత్​ ఇయర్​బడ్స్‌‌‌‌ వాడుతున్నారా? గంటలకొద్దీ పాటలు వింటున్నారా? నిరంతరాయంగా ఫోన్‌‌‌‌లు​ మాట్లాడుతున్నారా? అయితే, మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే. నిరంతరం బ్లూటూత్ ఇయర్‌‌‌‌బడ్స్ వాడకం వల్ల చెవిలో గాలి ఆడక బ్యాక్టీరియా చేరి చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడంలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

వైర్‌‌‌‌లెస్ మోజులో పడి గంటల తరబడి వీటిని చెవుల్లో ఉంచుకోవడం వల్ల వినికిడి శక్తి దెబ్బతినడమే కాకుండా, చెవిలో ఎప్పుడూ ఏదో తెలియని రింగింగ్ శబ్దం వినిపించే ‘టినైటస్’  బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.

వైర్లు లేని సౌలభ్యం ఉండటంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్లూటూత్ ఇయర్ బడ్స్‌‌‌‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ, పాటలు వింటూ, రీల్స్ చూస్తూ గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీస్తోందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని అవసరానికి వాడాలే తప్ప, ఆరోగ్యాన్ని బలి తీసుకునేలా ఉండకూడదని హితవు పలుకుతున్నారు.

చెవిలో గాలి ఆడక.. బ్యాక్టీరియా చేరి..

ఫోన్లు మాట్లాడేటప్పుడు, పాటలు వినే సమయంలో.. బయటి సౌండ్లు వినిపించకూడదని చాలా మంది ఇయర్ బడ్స్‌‌‌‌ను చెవి లోపలికి గట్టిగా పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చెవి మార్గం పూర్తిగా మూసుకుపోయి లోపలికి గాలి వెళ్లే అవకాశం ఉండదు. సహజంగానే చెవి లోపల కొంత తేమ ఉంటుంది. గాలి ఆడకపోవడంతో ఆ తేమ పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ చేరేందుకు అనువైన స్థలంగా మారుతుంది. దీనివల్ల చెవిలో తీవ్రమైన దురద, నొప్పి కలగడమే కాకుండా ఇన్ఫెక్షన్లు సోకి చీము పట్టే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఇయర్ బడ్స్ వాడేవారిలో చెవి లోపలి చర్మం సెన్సిటివ్‌‌‌‌గా మారి రకరకాల చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని వివరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు ముదిరితే లోపలి కర్ణభేరి దెబ్బతినే అవకాశం కూడా  ఉందని హెచ్చరిస్తున్నారు. 

80 డెసిబుల్స్ దాటితే.. శాశ్వత చెవుడే

బ్లూటూత్ ఇయర్‌‌‌‌‌‌‌‌ బడ్స్‌‌‌‌ను చెవిలో గట్టిగా బిగించి 80 డెసిబుల్స్ దాటి సౌండ్ పెంచితే, ఆ శబ్ద తరంగాలు బయటకు పోయే దారి లేక మన చెవి లోపల ఒక చిన్నపాటి బాంబులా పేలుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ బడ్స్ వల్ల చెవి మార్గం పూర్తిగా సీల్ అయిపోవడం వల్ల, మనం వినే ఆ భారీ సౌండ్స్ నేరుగా కర్ణభేరీని వణికిస్తూ లోపల ఉండే కోక్లియా అనే సున్నితమైన భాగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. 

ఇందులో ఉండే వేల సంఖ్యలోని నాడీ కణాలు అధిక శబ్దానికి తట్టుకోలేక నలిగిపోతాయి. ఈ కణాలు మన శరీరంలో ఒక్కసారి చనిపోతే మళ్లీ పుట్టవు.. అంటే వినికిడి శక్తి శాశ్వతంగా  హరించుకుపోయే ప్రమాదం ఉన్నది. ఈ సౌండ్స్ వల్ల చెవిలోని సున్నితమైన ఎముకలు అరిగిపోవడమే కాకుండా, నిరంతర ఒత్తిడితో రక్తప్రసరణ ఆగిపోవడంలాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే స్టైల్ కోసం వాల్యూమ్ పెంచే ఆ క్షణికానందం, శాశ్వత చెవుడు వైపు నెట్టేస్తుందని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.

టినైటస్ ముందస్తు హెచ్చరిక..

రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా బ్లూటూత్ బడ్స్ పెట్టుకొని గంటలకొద్దీ  పెద్ద సౌండ్లతో వినేవారిలో ‘టినైటస్’ అనే సమస్య వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు బయట ఏ శబ్దమూ లేకపోయినా, చెవిలోపల మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని రింగింగ్ సౌండ్, ఈల వేసినట్టు లేదా రైలు కూత పెట్టినట్టు వినబడుతూ ఉంటుంది. అధిక సౌండ్లతో వినడం వల్ల చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతిని మెదడుకు తప్పుడు సంకేతాలు పంపడం వల్లే ఈ వింత శబ్దాలు వినిపిస్తాయి. 

దీనివల్ల ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఏ పని మీద ఏకాగ్రత కుదరదు. ఇది వినికిడి శక్తి పూర్తిగా పోవడానికి ముందస్తు హెచ్చరిక అని, ఒక్కసారి ఈ సమస్య మొదలైతే జీవితాంతం ఆ వింత శబ్దాలతో నరకం చూడాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.  ఏ సౌండ్ లేకపోయినా..  చెవిలో రింగింగ్ మొదలైందంటే.. వినికిడి వ్యవస్థ ప్రమాదంలో పడిందనడానికి సంకేతమని డాక్టర్లు సూచిస్తున్నారు.

నిద్రలో వాడితే డేంజర్ 

రాత్రి పూట పడుకునే ముందు మంచి మెలోడీ సాంగ్స్ వింటేనే నిద్రపడుతుందని చాలా మంది.. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నిద్రపోతారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పడుకున్నప్పుడు బడ్స్ చెవిపై ఒత్తిడి కలిగించడం వల్ల ఆ భాగంలో రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంది. 

అంతేకాకుండా, వైర్‌‌‌‌‌‌‌‌లెస్ హెడ్ ఫోన్ల నుంచి వెలువడే తరంగాల ప్రభావంతో నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, ఏకాగ్రత తగ్గడంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే బ్లూటూత్ వాడకాన్ని పరిమితం చేయాలని, అవసరం లేనప్పుడు వాటిని తీసివేసి చెవికి తగినంత గాలి తగిలేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

చిన్న వయసులోనే వినికిడి సమస్యలు

ఒకప్పుడు మన తాతలకు, అమ్మమ్మలకు 50 ఏండ్లు దాటిన తర్వాత వచ్చే వినికిడి సమస్యలు, ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయి చిన్న వయసులోనే వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు హెడ్ ఫోన్లు, బడ్స్ వాడకూడదు. ఒకవేళ ఆఫీసు పనుల కోసం డైలీ వాడాల్సి వస్తే.. వాల్యూమ్ 60 శాతం లోపే ఉండాలి. 

అలాగే ప్రతి 60 నిమిషాలకు ఒకసారి బ్రేక్ ఇస్తూ చెవికి గాలి తగిలేలా చూసుకోవాలి. 80 డెసిబుల్స్ దాటి సౌండ్ పెట్టి వింటే కర్ణభేరి డ్యామేజ్ అయి పర్మినెంట్‌‌‌‌గా చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చెవి బరువుగా అనిపించినా, లోపల వింత శబ్దాలు వస్తున్నా అశ్రద్ధ చేయొద్దు. ఇయర్ ఫోన్ల కంటే చెవిపై పెట్టుకునే హెడ్ సెట్స్ కొంత మేలైనప్పటికీ, ఏవీ వంద శాతం సురక్షితం కాదు.
– డాక్టర్ శమిత, ఈఎన్టీ సర్జన్, హైదరాబాద్

60/60 ఫార్ములా ఫాలో కావాల్సిందే.. 

బ్లూటూత్ సమస్యల నుంచి బయటపడాలంటే వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. బ్లూటూత్ మొత్తానికే వాడకూడదని, ఒకవేళ వాడాల్సి వస్తే... కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 60/60 సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు. 

అంటే వాల్యూమ్ 60 శాతం కంటే మించకూడదు.. అలాగే 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం వాడకూడదు. మధ్యలో విరామం ఇవ్వడం వల్ల చెవికి గాలి తగిలి ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. ఇయర్ బడ్స్‌‌‌‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని, ఇతరుల బడ్స్‌‌‌‌ను మనం వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీని తెలివిగా, మితంగా వాడుకుంటేనే అన్ని రకాలుగా మంచిదని సూచిస్తున్నారు.