- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఊహించని రీతిలో ఇన్ కం
- గతేడాదితో పోలిస్తే తగ్గిన 2 వేల డాక్యుమెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఊహించని రీతిలో ఆదాయం సమకూరుతోంది.
కొత్త విలువల ప్రభావం వల్ల గతేడాదితో పోలిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, వచ్చే ఆదాయంలో మాత్రం ఊహించని వృద్ధి కనిపిస్తోంది. కొత్త ధరల పెంపు వల్ల సగటున రోజూ దాదాపు రూ. 10 కోట్ల మేర అదనపు ఆదాయం లభిస్తుండటం విశేషం. వాస్తవానికి మార్కెట్ వాల్యూ సవరించడానికి ముందే, అంటే మే నెలలోనే ముందస్తు రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ. 1,700 కోట్ల రాబడి వచ్చింది. అయినప్పటికీ జూన్ నెలలో కూడా రిజిస్ట్రేషన్ల జోరు అస్సలు తగ్గలేదు.
గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు అదనం
జూన్ 25వ తేదీ నాటికి అందిన అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది జూన్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 920 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జూన్ 25 నాటికే అది ఏకంగా రూ. 1,023.42 కోట్లకు చేరింది. నెలాఖరు నాటికి వచ్చే పూర్తి ఆదాయాన్ని అంచనా వేస్తే.. ఈసారి అది రూ. 1,100 కోట్లకు పైగా దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే దాదాపు రూ. 200 కోట్లు అదనంగా ఖజానాకు చేరనున్నాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల పరంగా చూస్తే.. గతేడాది జూన్ 25 వరకు అగ్రికల్చర్, నాన్-అగ్రికల్చర్ విభాగాలు కలిపి మొత్తంగా 1,02,513 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కాగా, ఈ ఏడాది జూన్ 25 నాటికి మొత్తం 1,00,726 డాక్యుమెంట్లు నమోదయ్యాయి.
స్థిరంగా ఆదాయం
ఈ నెల 5న భూముల ధరల పెంపు నిర్ణయం తర్వాత రిజిస్ట్రేషన్ల వేగం పుంజుకుంది. జూన్ 10న రూ. 50.79 కోట్లు, 11న రూ. 50.30 కోట్లు, 12న రూ. 54.82 కోట్లు చొప్పున ఆదాయం రాగా, జూన్ 17న ఒక్కరోజే అత్యధికంగా రూ. 97.94 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ సగటున రూ. 55 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు స్థిరంగా రాబడి వస్తోంది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందనే అంచనాల మధ్య.. ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఆదాయం పెరగడం పట్ల ఆర్థిక శాఖ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నగరాలు, పట్టణాల శివార్లలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్ల విలువలు పెరగడమే ఈ భారీ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణమని క్షేత్రస్థాయి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
