రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్బీఐ చర్చలు సఫలం.. ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు అంగీకారం 

రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్బీఐ చర్చలు సఫలం.. ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు అంగీకారం 
  • సీఎస్‌‌‌‌తో భేటీలో సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) యాజమాన్యానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 22న జరిగిన ప్రాథమిక చర్చలకు కొనసాగిం పుగా.. శనివారం ఇరుపక్షాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సీఎస్ రామకృష్ణారావు అధ్య క్షతన జరిగిన ఈ భేటీలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక పాల్గొన్నారు. 

ఎస్బీఐ తరఫున డీబీడీ అండ్ సీడీఓ జి.ఎస్. రాణా, తెలంగాణ సీజీఎం నీలేష్ ద్వివేది, ఏజీఎం జి. పూవళి హాజరై చర్చించారు. ఈ చర్చల అనంతరం ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వక, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం లభించింది. హైదరాబాద్‌‌ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సర్వే నంబర్ 83/1లోని రూ.1,038 కోట్ల విలువైన 5.09 ఎకరాల భూమి వేలం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్బీఐ యాజమాన్యానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. 

గతంలో కేటాయించిన ఈ స్థలంలో ఎస్బీఐ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వం దీనిని రద్దు చేసి వేలం వేయగా, దీనిపై బ్యాంక్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. దానికి ప్రతిగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణకు సర్కార్ సిద్ధమవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గత సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, స్థలాలను పరిశీలించేందుకు ఈ నెల 23న ఎస్బీఐ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. 

ప్రభుత్వం చూపించిన ప్రత్యామ్నాయ స్థలం, ప్రతిపాదనలు బ్యాంకింగ్ అవసరాలకు అనుకూలంగా ఉండటంతో ఎస్బీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో, ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ స్థలాలకు మొగ్గు చూపారు. త్వరలోనే తమ బ్యాంక్ బోర్డు అధికారిక ఆమోదం పొందిన తర్వాత, కోర్టు నిబంధనల ప్రకారం కేసును ఉపసంహరించుకుంటూ ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకనున్నట్లు ప్రకటించారు.