హైదరాబాద్, వెలుగు: గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడమే ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే కొందరు కార్మిక సంఘాల నాయకులు ఇప్పుడు మాట మారుస్తూ... ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.
శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి విధి విధానాలను (రూల్స్) రూపొందించేందుకు ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు.
ముందు అధికారిక సంఘం ఏదో తేలాలి..
అధికారుల కమిటీలో ఆర్టీసీ కార్మికుల తరఫున గుర్తింపు సంఘం నాయకులు కూర్చోవాలంటే, ముందుగా ఎన్నికలు జరిగి అధికారిక సంఘం ఏదో తేలాలని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించిందని వెల్లడించారు. లేబర్ శాఖ జాయింట్ కమిషనర్ గోపాల్‌దాస్ సునీతను ఈ ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిగా కూడా నియమించామని చెప్పారు.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసి పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే, కొందరు నేతలు రాజకీయ స్వార్థంతో కార్మికుల్లో లేనిపోని అపోహలు సృష్టించడం బాధాకరమన్నారు.
