హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేఎస్. శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఆరేండ్ల పాటు కొనసాగనున్నారు.
అంతకుముందు రేరా చైర్మన్‌గా ఉన్న ఎన్. సత్యనారాయణ తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సత్యనారాయణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ప్రభుత్వం శ్రీనివాసరాజును అపాయింట్ చేసింది. నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీనివాసరాజు ప్రస్తుతం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం
శ్రీనివాసరాజుకు పరిపాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఐఏఎస్ సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత, గతేడాది రాష్ట్ర మౌలిక వసతులు, ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈఓ)గా ఆయన సుదీర్ఘ కాలం పాటు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ కేడర్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు.
అప్పిలేట్ ట్రిబ్యునల్ మెంబర్‌గా వేముల శ్రీకర్
అలాగే, రాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వేముల శ్రీకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. కేంద్ర రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016 నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది.
నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలు అన్నీ రేరా చట్టానికి లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించడం, అనుమతులు లేని వెంచర్లు, ప్రీ-లాంచ్ మోసాలు, బిల్డర్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడమే నూతన చైర్మన్ నేతృత్వంలోని రేరా బోర్డు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
