- మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్
ఆదిలాబాద్, వెలుగు: ‘సర్’ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, మొన్న వెస్ట్‌బెంగాల్‌లో చేసినట్లే తెలంగాణలో చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉండాలన్నారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగిస్తే ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సర్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న అబద్దపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ అధికారంలో ఉండి.. ఒక ఎమ్మెల్యేనైన తనకు తెలియకుండానే ఏజెన్సీలో ఉద్యోగ విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా ఉండి కూడా తన ప్రాంతంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లతో ప్రొసీడింగ్స్ఇప్పించడం దారుణమన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మంత్రుల వద్దకు వెళ్లి లెటర్లు తీసుకొచ్చి లబ్ధి పొందుతున్నారని, దీనివల్ల పార్టీకి సరైన గుర్తింపు రావడం లేదన్నారు. అంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తాటిగూడ, అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, నియోజకవర్గ అబ్జర్ వర్ రమేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, తదితరులు పాల్గొన్నారు.
