సర్ చుట్టూ సవాళ్లు... 2002 సర్ లిస్ట్‌‌‌‌లో పేరుందా ? లేదా?.. స్పష్టత లేక అయోమయంలో ఓటర్లు..

సర్ చుట్టూ సవాళ్లు... 2002 సర్ లిస్ట్‌‌‌‌లో  పేరుందా ? లేదా?.. స్పష్టత లేక అయోమయంలో ఓటర్లు..
  • 3 రోజుల్లో 1.02 కోట్లకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామంటున్న అధికారులు
  • క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్న పరిస్థితులు
  • పలుచోట్ల బీఎల్‌‌‌‌వోలకు బదులు ఫారాలు పంచుతున్న బీఎల్‌‌‌‌ఏలు
  • దీంతో ‘సర్’​ ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటున్నదనే విమర్శలు
  • నిరక్షరాస్యుల ఇండ్లలో ఫారాలు నింపుతున్న తీరుపై అనుమానాలు
  • గ్రామాల్లో సమస్యలపై అధికారులను నిలదీస్తున్న ప్రజలు
  • పలుచోట్ల మొరాయిస్తున్న సర్వర్లు.. ఇంకొన్ని చోట్ల ఓటర్ల మ్యాపింగ్​ జరగక ఇబ్బందులు 
  • ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో తికమక..ఒకే ఫారంలో కొందరికి రెండు అడ్రస్‌‌‌‌లు
  • ఇటు బీఎల్‌‌‌‌వోలు, అటు ఓటర్లలో అవగాహనలోపంతో నెమ్మదించిన ప్రక్రియ

హైదరాబాద్/ నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. జూన్ 25 నుంచి 27 వరకు కేవలం మూడు రోజుల్లోనే ఇంటింటి సర్వే ద్వారా రికార్డు స్థాయిలో  కోటి 2 లక్షల 75 వేల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి వెళ్తున్న తమకు ప్రజల నుంచి తగినంత సహకారం లభించడం లేదని బూత్​ లెవల్​ఆఫీసర్​(బీఎల్‌‌‌‌వో)లు వాపోతున్నారు. సిబ్బందితోపాటు ప్రజల్లోనూ అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు సిబ్బంది కొరత ‘సర్’​ ప్రక్రియకు ప్రధాన అవరోధంగా మారుతోంది.

స్వయంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాల్సిన బీఎల్‌‌‌‌వోలు.. సిబ్బంది లేమి, పనిఒత్తిడి పేరుతో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)పై ఆధారపడుతున్నారు. పలు ప్రాంతాల్లో బీఎల్‌‌‌‌వోలకు బదులు బీఎల్‌‌‌‌ఏలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ ​హైదరాబాద్‌‌‌‌లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల ప్రతినిధులే నేరుగా ఇండ్లకు వెళ్లి  ఫారాలను పంపిణీ చేస్తుండటంతో సర్వే కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోంది. 

దీనికితోడు.. కొందరు రాజకీయ పార్టీల బీఎల్ఏలు అసలైన ఎన్యూమరేషన్ ఫారాలను కలర్ జిరాక్స్ చేయించి పంపిణీ చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపుతోంది.  దీనికితోడు నిరక్షరాస్యుల ఇండ్లల్లో దరఖాస్తులను ఎవరు నింపుతున్నారు? వాళ్లు సరైన వివరాలే నమోదు చేస్తున్నారా ? చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో వివరాల నమోదు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారంతో ‘సర్’​ పారదర్శకతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా జులై ఒకటో తేదీ కల్లా 3.38 కోట్ల ఎన్యూమరేషన్​ ఫారాలు ఓటర్లందరికీ బీఎల్‌‌ఓలు పంపిణీ చేయాల్సి ఉంది.  2002 ఓటరు లిస్ట్‌‌లో తమ పేరు ఉందా ? లేకపోతే ఏమైతుందనే సందేహాలు కూడా జనాల నుంచి వ్యక్తం అవుతుండగా.. వారికి స్పష్టత ఇచ్చే వారు కరువయ్యారు.

గ్రామాల్లో నిలదీతలు..

వివిధ రాష్ట్రాల  సరిహద్దు గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పరందోళి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడానికి వెళ్లిన తహసీల్దార్ నాగార్జున గౌడ్, రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. 

ఈ నెల 30 నుంచి మహారాష్ట్రలోనూ సర్వే ప్రారంభం కానుండటంతో, అక్కడి చంద్రపూర్ జిల్లా అధికారుల హామీలను బట్టే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ పత్రాలు తీసుకోకుండా వెనక్కి పంపారు. తమ సాగు భూములకు పట్టాలు ఇచ్చి, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అటు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్, కొరిటికల్, రోల్ మామడ గ్రామాల్లో ‘ఓట్లప్పుడే కనిపిస్తారా.. సమస్యలు పరిష్కరించరా’ అంటూ డ్రైనేజీలు, రోడ్ల దుస్థితిపై బీఎల్‌‌వోలను జనం నిలదీశారు.

అవగాహన లోపం.. పథకాలు పోతాయనే భయం

మరోవైపు ఈ సర్వే వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో తెలియక సాధారణ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.  సిద్దిపేటతోపాటు పలు జిల్లాలోని పలు గ్రామాల్లో సర్వే సిబ్బందికి ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ‘‘అసలు ఈ సర్వే ఎందుకు? ఓటు ఉన్నవాడు ఓటేస్తాడు, దీనితో మాకేం పని?’’ అంటూ జనం నిలదీస్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు అడుగుతుండడంతో ఎక్కడ తమ సంక్షేమ పథకాలు కట్ అవుతాయోనని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. చదువు రాని వారు సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తూ, తమ పిల్లలు వచ్చాక ఫారాలు నింపిస్తామని సిబ్బందిని వెనక్కి పంపుతున్నారు. సర్వేకు ముందు గ్రామాల్లో చాటింపు వేయించకపోవడం వల్లే ఈ అపార్థాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం.. అసంపూర్తిగా జాబితాలు

పాలనాపరమైన, సిబ్బంది లోపాలు కూడా ‘సర్‌‌‌‌’ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో కొన్నిచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల ప్రింటింగ్ స్పష్టంగా లేకపోవడంతో కొత్త పత్రాలు తెప్పించాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో 20 మంది పేర్లు 2002 ఓటరు జాబితాలో లేకపోవడంపై బీఎల్‌‌వోలకు ఫిర్యాదులు అందగా, మహాముత్తారం యత్నారంలో 99 మంది ఓటర్ల పేర్లు మ్యాపింగ్ కాలేదు. ఇక్కడ జీపీఓలే బీఎల్‌‌వోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ములుగు జిల్లాలోనైతే కొందరు బీఎల్‌‌వోలు నామమాత్రంగా పనిచేస్తూ, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఫారం ఇచ్చి వెళ్లిపోతున్నారని, చదువు రాని వారిని వేరేవాళ్లతో ఫారాలు నింపించుకోవాలని చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సర్వర్ సతాయింపు.. ఇంకా సాగుతున్న పంపిణీ

సాంకేతిక సమస్యలు కూడా సిబ్బందికి ఇబ్బందిగా మారాయి. కరీంనగర్ జిల్లాలో బీఎల్‌‌వోలు వివరాలు నమోదు చేస్తుంటే ట్యాబ్‌‌లలో సర్వర్లు సతాయిస్తుండటంతో పనులు నెమ్మదించాయి. ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం కూడా ఇంకా అనేక చోట్ల ఫారాల పంపిణీ సాగుతూనే ఉంది. వారం తర్వాత నింపిన ఫారాలు తీసుకుంటామని సిబ్బంది చెబుతున్నారు.

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొన్ని వార్డుల్లో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలే అందకపోవడం గమనార్హం. లక్ష్యాలు పెద్దవిగా ఉన్నా, క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమిస్తూ ఈ స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ఇటు అధికారులకు, అటు పొలిటికల్​పార్టీలకు పెద్ద పరీక్షగా మారింది.

ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో తికమక

‘సర్’ ప్రక్రియలో భాగంగా బీఎల్​వో ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి వెళ్లిపోతుండడంతో వాటిని నింపేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫారం మొదటి కాలంలోనే 2002 సర్‌‌‌‌కు సంబంధించిన వివరాలు తెలపాలని ఉండడం, ఆ లిస్ట్ లో పేరుందో, లేదో తెలియకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. 2025 ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నప్పటికీ... 2002 లిస్ట్​లో ఉందో ? లేదో ? తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తు్న్నారు. 

అలాగే అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అడుగుతుండడంతో ఇవన్నీ తమకు ఎలా తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు కొందరు ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్​ ఫారాల్లో తప్పులు కనిపించడం మరిన్ని సమస్యలకు కారణమవుతోంది. ఒకే ఫారంపై పక్కపక్కనే రెండు రకాల అడ్రస్​లు ప్రింట్​చేసి ఉన్న పత్రాలను బీఎల్ వోలు ఇచ్చారు. దీనిపై ఆలేరు మున్సిపాలిటీలో బీఎల్​వోలతో పలువురు  వాగ్వాదానికి దిగారు. 

2002 లిస్ట్ నుంచి పేర్లు గల్లంతు

కొందరు ఓటర్ల పేర్లు 2002 లిస్ట్​ నుంచి మాయమయ్యాయి. 1995లో జారీ చేసిన ఓటర్​కార్డులు ఉండి.. 1998, 1999 ఎన్నికల్లో ఓట్లు వేశారు. అదే విధంగా 2009, ఆ తర్వాత జారీ చేసిన ఓటరు కార్డులతోనూ పలు ఎన్నికల్లో ఓటు వేశారు. అయినప్పటికీ..  2002లో నిర్వహించిన ‘సర్’లో పేర్లు గల్లంతయ్యాయి. 

అయితే 1995, ఆ తర్వాత జారీ చేసిన కార్డులను గుర్తింపుగా పరగిణించబోరని బీఎల్‌‌వోలు చెబుతున్నారు. 1987 కంటే ముందు పుట్టినవారు.. ప్రస్తుత ‘సర్’లో ఓటరుగా పేరు నమోదు కావాలంటే 1987కు ముందు ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలు, ఆఫీసులు జారీ చేసిన గుర్తింపు కార్డు గానీ, ధ్రువీకరణ పత్రం గానీ చూపించాలని ఎన్యూమరేషన్​ఫారంలో పేర్కొన్నారు. ఇన్నేండ్ల క్రితం జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు  ఎంత మంది వద్ద అందుబాటులో ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఎదురవుతున్న సమస్యలివే..

  • ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్, కొరిటికల్, రోల్ మామడ గ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేందుకు బీఎల్‌‌వోలు వెళ్లారు. దీంతో ‘ఓట్లప్పుడు వచ్చారు.. ఇప్పుడు ఓట్లు అనుకుంటా వస్తున్నారా?’ అంటూ గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలు పరిష్కరించడం లేదంటూ మండిపడ్డారు. 
  • యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారాల ప్రింటింగ్ స్పష్టంగా లేకపోవడంతో.. కొత్త ఫారాలు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
  • భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన 20 మంది పేర్లు 2002 ఓటరు జాబితాలో  లేకపోవడంతో బీఎల్‌‌వోకు ఫిర్యాదు చేశారు. మహాముత్తారం మండలం యత్నారం గ్రామంలో 99 మంది ఓట్లర్ల పేర్లు మ్యాపింగ్ కాలేదు. మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో జీపీవోలే బీఎల్‌‌వోలుగా విధులు నిర్వహిస్తున్నారు.
  • ములుగు జిల్లాలో కొందరు బీఎల్‌‌వోలు నామమాత్రంగా పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఒక ఇంట్లో ముగ్గురు ఓటర్లు ఉంటే... ఒక్కరికి ఫారం ఇచ్చి మిగిలిన ఇద్దరివీ వేరే వాళ్లు వచ్చి ఇస్తారని చెబుతున్నారు. చదువురాని వారికి ఫారాలు ఇచ్చి వేరే వారితో నింపించాలని, తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది.
  • ఖమ్మం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. బీఎల్‌‌వోలు శనివారం సాయంత్రం కూడా చాలా ప్రాంతాల్లో ఫారాలను పంపిణీ చేశారు. వాటిని పూర్తి చేసి పెట్టాలని, వారం రోజుల తర్వాత తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు.