హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా అజిత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో సీఎం స్పెషల్ సెక్రటరీగా ఉన్న అజిత్ రెడ్డిని ప్రభుత్వం 'ఇన్వెస్ట్ తెలంగాణ' సీఈవోగా నియమించింది. దానికి అదనంగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ అడిషనల్ ఎండీగా కూడా ఆయన విధులు నిర్వర్తించనున్నారు.
ఇన్వెస్ట్ తెలంగాణ బోర్డు బలోపేతం..
దేశ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణను ఒక ప్రధాన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా 'ఇన్వెస్ట్ తెలంగాణ'ను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు మాదిరిగా, 'తెలంగాణ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు' తరహాలో దీనిని మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి, ఇన్వెస్టర్లకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది.
ఇన్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం, ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయో గుర్తించనుంది. పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకులు, దేశీయ సంస్థల నుంచి సమీకరించడం, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వేగంగా వచ్చేలా అంతర్గత సమన్వయం చేయనుంది.
