హార్మూజ్ లో మళ్లీ టెన్షన్... ఇరాన్, అమెరికా పరస్పరం డ్రోన్, క్షిపణి దాడులు... సీజ్‌‌‌‌ఫైర్ ఉల్లంఘనపై ఇరుదేశాల ఆరోపణలు 

హార్మూజ్ లో మళ్లీ టెన్షన్... ఇరాన్, అమెరికా పరస్పరం డ్రోన్, క్షిపణి దాడులు... సీజ్‌‌‌‌ఫైర్ ఉల్లంఘనపై ఇరుదేశాల ఆరోపణలు 
  • హార్మూజ్‌‌‌‌లో నౌకపై ఇరాన్ దాడి.. ఇరాన్ తీరప్రాంతంపై అమెరికా అటాక్​ 
  • బహ్రెయిన్‌‌‌‌లోని యూఎస్ బేస్‌‌‌‌పై, హార్మూజ్‌‌‌‌లో మరో నౌకపై విరుచుకుపడ్డ ఇరాన్ 
  • ఒమన్ వద్ద నౌకామార్గాన్ని విస్తరించిన యూఎస్ నేవీ 
  • ఒప్పందాన్ని మూర్ఖంగా ఉల్లంఘించారు: ట్రంప్

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించింది ‘మీరంటే మీరే’నంటూ రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. శనివారం బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో పాటు హార్మూజ్ జలసంధిలో ఒక నౌకపైనా దాడికి పాల్పడింది. శుక్రవారం రాత్రి అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగానే ఇరాన్ ఈ చర్యలకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. 

అయితే, గురువారం హార్మూజ్ జలసంధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా ఈ వైమానిక దాడులను ప్రారంభించినట్టు అమెరికా ప్రకటించింది. దీంతో ఇరాన్, అమెరికా కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శనివారం హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక ట్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి జరిగిందని బ్రిటిష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కేంద్రం తెలిపింది. 

ఆ నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, పర్యావరణ నష్టం ఏమీ జరగలేదని పేర్కొంది. ఈ ఘటన తర్వాత అమెరికా నౌకాదళ పర్యవేక్షణలోని ఒక బహుళ జాతీయ నౌకాయాన సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. రాకపోకలు రెండింటికీ అనుమతించడానికి వీలుగా హార్మూజ్ జలసంధిలో ఒమన్ సమీపంలోని మార్గాన్ని విస్తరించామని తెలిపింది. దీంతో ఇది ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరో కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. 

కాగా, ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలపై శనివారం తాము దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్మూజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఇది ప్రతిస్పందన అని స్పష్టం చేసింది. ఇరాన్ కాల్పుల విరమణను స్పష్టంగా ఉల్లంఘించిందని పేర్కొంది. 

దాడులను ఖండించిన బహ్రెయిన్ 

తమ దేశంపై ఇరాన్ డ్రోన్ దాడిని బహ్రెయిన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇరాన్ నుంచి అనేక డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో దాడులు జరిగాయి. ఇది దేశ పౌరుల భద్రతకు ముప్పు కలిగించడమే”అని స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ పారామిలిటరీకి చెందిన ఐఆర్జీసీ(ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్) శనివారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇర్నా వార్తా సంస్థ ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాము ఈ ప్రాంతంలోని ‘అమెరికా ఉగ్రవాద సైన్యం’కు చెందిన అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారనేది పేర్కొనలేదు.

నౌకపై దాడిని సమర్థించుకున్న ఇరాన్ 

హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సలహాదారు మొహమ్మద్ రెజాయ్ ఆరోపించారు. తమ తీరప్రాంత నిఘా కేంద్రాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు జరిగాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించాయని ఆరోపించింది. 

అయితే, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సిరిక్ ఓడరేవుపై అమెరికా జరిపిన దాడి వల్ల ఎటువంటి నష్టం జరగలేదని, పరిస్థితి సాధారణంగానే ఉందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ మెహర్ వార్తా సంస్థ నివేదించింది. ‘‘హార్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. కాబట్టి నిబంధనలను గౌరవించండి. నియంత్రణను ఉద్రిక్తతగా భావించి పొరపడకూడదు”అని ఇరాన్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ  అన్నారు. ‘‘ఇది కాల్పుల విరమణ ఉల్లంఘన కాదు. కాల్పుల విరమణ నిర్వహణ”అని ఆయన పేర్కొన్నారు.     

ఒప్పందాన్ని మూర్ఖంగా ఉల్లంఘించారు: ట్రంప్

హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాణిజ్య నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ‘‘స్పష్టంగా, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూర్ఖంగా ఉల్లంఘించడమే’’ అని పేర్కొన్నారు. ఇరాన్ మళ్లీ దాడులకు పాల్పడితే హింసకు హింసతోనే
 సమాధానం ఉంటుందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా హెచ్చరించారు. 

అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ త్రైపాక్షిక ఒప్పందం  

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా టెర్రరిస్ట్ గ్రూప్ మధ్య దీర్ఘకాలంగా నడుస్తున్న ఘర్షణను ముగించే లక్ష్యంతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల అనంతరం ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా శుక్రవారం త్రైపాక్షిక ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విదేశాంగ శాఖ ఆఫీసులో అమెరికా ప్రతినిధి సమక్షంలో లెబనాన్ రాయబారి నాదోద్, ఇజ్రాయెల్ రాయబారి యెహీయెల్ లైటర్ ఈ పత్రంపై సంతకం చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. 

ఈ సంతకాలకు ముందు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఒప్పందాన్ని ఒక ముఖ్యమైన మొదటి అడుగుగా అభివర్ణించారు. ‘‘ఈ రోజు మనం ఒక కష్టమైన ప్రయాణంలో మొదటి అడుగు వేశాం”అని అన్నారు.