దివ్యాంగులకు ఈ‌‌‌‌-ఆటోలతో భరోసా.. 14 నైబర్‌‌‌‌‌‌‌‌హుడ్ సెంటర్లకు వాహనాల పంపిణీ

దివ్యాంగులకు ఈ‌‌‌‌-ఆటోలతో భరోసా.. 14 నైబర్‌‌‌‌‌‌‌‌హుడ్ సెంటర్లకు వాహనాల పంపిణీ
  • 14 నైబర్‌‌‌‌‌‌‌‌హుడ్ సెంటర్లకు వాహనాల పంపిణీ
  • జాలి వద్దు.. సమాన అవకాశాలు కావాలి: మంత్రి సీతక్క
  • హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. రవాణా ఇబ్బందుల వల్ల థెరపీ సెంటర్లకు రాలేని దివ్యాంగ పిల్లల కోసం ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

శనివారం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా సెర్ప్ ఆధ్వర్యంలో 14 నైబర్‌‌‌‌‌‌‌‌హుడ్ సెంటర్లకు ‘ఈ–ఆటో’లను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులపై జాలి చూపాల్సిన అవసరం లేకుడా.. సమాజంలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రవాణా సమస్యల వల్ల ఆటిజం, మేధోవైకల్యం ఉన్న పిల్లలను కేంద్రాలకు తీసుకురాలేకపోతున్నామని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వారి కష్టాలను తీర్చేందుకే ఈ– ఆటోలను ఇస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా పిల్లలకు ఇంటి నుంచి సెంటర్ వరకు ఉచితంగా రవాణా సౌకర్యం లభిస్తుందని, తద్వారా వారు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి సేవలు పొందవచ్చని చెప్పారు.

త్వరలో నైబర్ హుడ్ సెంటర్ల విస్తరణ 
ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌‌‌‌‌‌‌‌హుడ్ సెంటర్లు నడుస్తున్నాయని త్వరలోనే వీటిని మరింత విస్తరిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దివ్యాంగుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారికి చిన్న ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. హెలెన్ కెల్లర్ జీవితమే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. మహిళా సంఘాల్లో ఉన్న దివ్యాంగుల కోసం సెర్ప్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 13 వేల దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, 82 వేల మందిని సభ్యులుగా చేర్చామన్నారు. స్త్రీనిధి ద్వారా రూ.38.16 కోట్లు, గ్రామ సంఘాల ద్వారా రూ.4.13 కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, డైరెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.