- కర్నాటక, ఏపీ కలిసి తెలంగాణను ముంచుతున్నాయని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం రోజు మూడు రాష్ట్రాల సీఎంల మీటింగ్‌లో చేసుకున్న సీక్రెట్ఒప్పందం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్‌చేశారు. ఇరిగేషన్మంత్రిని పక్కనపెట్టి ముగ్గురు సీఎంలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. శనివారం తెలంగాణభవన్ లో మీడియాతో హరీశ్మాట్లాడారు.
కర్నాటక, ఏపీ కలిసి తెలంగాణను ముంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, ఆర్డీఎస్ కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో నావళి రిజర్వాయర్ ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని.. దాని వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇటు ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
ఇటు కర్నాటక, అటు ఏపీ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చేస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పూడిక సమస్య ఉంటే.. పూడిక తీసే మార్గాలు అన్వేషించాలి గానీ కొత్త ప్రాజెక్ట్ అవసరం లేదని, గుండ్రేవుల ప్రాజెక్టుపై 2013లో నాటి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. గుండ్రేవులకు నీటి కేటాయింపులు చేయలేమని తేల్చి చెప్పిందన్నారు.
తుంగభద్ర నదిపై ఈ 55 టీఎంసీల నీటిని అటు కర్నాటక, ఇటు ఏపీ ఆపేస్తే ఆ నీరు అల్టిమేట్‌గా శ్రీశైలం ప్రాజెక్టుకు రాదు. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సీక్రెట్ మీటింగ్ లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రేవంత్ రెడ్డి ప్రజలకు వెల్లడించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
