- జైనూర్ మండలం మార్లవాయిలో వర్ధంతి
- హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, పీవోలు
జైనూర్, వెలుగు: గిరిజనుల ఆత్మబంధువులు హైమన్ డార్ఫ్–బెట్టి ఎలిజబెత్ దంపతుల స్ఫూర్తితో ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే భరోసా ఇచ్చారు. ఆదివారం జైనూర్ మండలంలోని మార్లవాయిలో డార్ఫ్ దంపతుల 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ నితికాపంత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో మాట్లాడుతూ.. కనీస వసతులకు ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలను బయట ప్రపంచానికి పరిచయం చేసి వారి అభివృద్ధి బాటలు వేశారని డార్ఫ్ దంపతులను కొనియాడారు.
ఆదివాసీల గుండెల్లో ఆరాధ్య దైవాలుగా నిలిచారని పేర్కొన్నారు. చదువుతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఆదివాసీ కుటుంబం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. మార్లవాయి అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.91 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సర్పంచ్ కనక ప్రతిభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాంనాయక్, జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కుడ్మేత విశ్వనాథ్, మంగ, ఆసిఫాబాద్ డీడీ రమాదేవి, ఐటీడీఏ డీఈ తానాజి, జిల్లా సార్మెడి కుర్సెంగ మోతిరామ్, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర నేత సిడం అర్జు, నాయకులు మర్సకోల తిరుపతి, మెస్రం అంబాజీ రావు, పలు గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.
ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్
కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీల ఆత్మబంధువు, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ వర్ధంతి ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆదివాసీ నాయకులు మెస్రం రాజారాం, సంతోష్, మల్లేశ్, సిడం వెంకటేశ్, ధర్మయ్య, మైకేల్ జాక్సన్ తదితరులు పాల్గొన్నారు.
