యుద్ధం మన తలుపు దగ్గరకొచ్చినా నోరు మెదపరా? ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

యుద్ధం మన తలుపు దగ్గరకొచ్చినా నోరు మెదపరా? ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంలో ఇరాన్‌‌‌‌‌‌‌‌ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాను అమెరికా ముంచేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యుద్ధం మన దేశ తలుపు దగ్గరకొచ్చినా నోరు మెదపరా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

‘‘ప్రస్తుతం ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. మున్ముందు మరింత పెద్ద తుపానులే రాబోతున్నాయి. మన దేశంలో చమురు కొరత ఏర్పడే  ప్రమాదముంది. ఎందుకంటే మన దేశానికి  40 శాతానికి పైగా ముడిచమురు దిగుమతులు హార్ముజ్ జలసంధి నుంచే వస్తాయి.అది మూతబడే ప్రమాదంలో పడింది. ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ, ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ దిగుమతుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇరాన్ యుద్ధనౌక హిందూ మహా సముద్రంలో మునిగిపోవడంతో యుద్ధం ఇప్పుడు మన ఇంటి ఆవరణలోకి చేరుకుంది. అయినా, దానిపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన దేశ స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టారు’’ అని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వాన్ని ఇంత పిరికిగా ఎప్పుడూ చూడలే: జైరాం రమేశ్

 కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఎక్స్‌‌ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘ఐఆర్ఐఎస్ దేనాను అమెరికా ముంచిన ఘటన భారత్‌‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు దీనిపై ప్రధాని మోదీ నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇరాన్‌‌ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యపై కూడా మోదీ ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వీడలేదు. భారత ప్రభుత్వాన్ని ఇంత  పిరికిగా ఎప్పుడు చూడలేదు. భారత్​లో విన్యాసాలు ముగించుకుని తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచేయడం కరెక్ట్ కాదు. దీనిపై మన ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందో అర్థం కావడం లేదు" అని పేర్కొన్నారు.