- సెక్రటేరియట్ ముట్టడికి యత్నం.. నాయకుల అరెస్ట్
ట్యాంక్ బండ్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనపై సిటీలో నిరసనలు కొనసాగుతున్నాయి. చిన్నారి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక వృత్తిదారుల సంఘం నాయకులు గురువారం ట్యాంక్ బండ్పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
రోడ్డుపై బైఠాయించి అక్కడి నుంచి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనంతరం సంఘం నాయకులు ఆశయ్య, శ్రీరామ్ నాయక్, ఆశలత మాట్లాడుతూ.. పోలీసులతో తమను అక్రమ అరెస్టులు చేయించడం ప్రభుత్వానికి సిగ్గుచేటు తప్ప మరొకటి లేదన్నారు. వెంటనే దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని కోరారు. సీఎం స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
