బషీర్‌బాగ్, వెలుగు: బషీర్బాగ్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, అబిడ్స్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ సీఐ భిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన జోగ్ సింగ్, చునరాం చౌదరి, అమ్రిత్ పురోహిత్ నగరంలో మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముగ్గురిని తనిఖీ చేయగా, సుమారు 72 గ్రాముల మేథంఫెటమిన్ డ్రగ్ లభ్యమైంది. ఈ మత్తు పదార్థాన్ని గ్రాముకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
