- క్లినికల్ చట్టాలు, మెడికో-లీగల్ కేసులపై నిపుణుల చర్చ
జూబ్లీహిల్స్ , వెలుగు: బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో గురువారం కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘ప్రవర 2026 - కేర్ గవర్నెన్స్, కంప్లయన్స్ సమ్మిట్ 2.0’ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆసుపత్రుల్లో సేవల నాణ్యత మెరుగుపరచడం, రోగుల హక్కుల పరిరక్షణ, ఆరోగ్యరంగంలో పారదర్శకత పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ.. కంప్లయన్స్ అనేది కేవలం పత్రాల నిర్వహణకే పరిమితం కాకుండా ఆసుపత్రి సంస్కృతిలో భాగంగా మారాలని సూచించారు. మంచి గవర్నెన్స్ ఉంటేనే ప్రజల్లో ఆసుపత్రులపై విశ్వాసం పెరుగుతుందని, ముఖ్యంగా గర్భస్రావానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సులో క్లినికల్ చట్టాలు, మెడికో-లీగల్ కేసులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు.
