కాళేశ్వరం డిజైన్ల బాధ్యతలు ఆఫ్రీకే..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు ఏజెన్సీ ఎంపిక కొలిక్కి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం డిజైన్ల బాధ్యతలు ఆఫ్రీకే..మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు ఏజెన్సీ ఎంపిక కొలిక్కి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ
  •     సాంకేతిక, ఆర్థిక అర్హతలు ఉన్నాయని చెప్పిన అధికారులు
  •     ఒకట్రెండు రోజుల్లో పనులు అప్పగించే అవకాశం
  •     బ్లాస్టింగ్ ద్వారా ఎస్ఎల్​బీసీ టన్నెల్ తవ్వకం
  •     పనులు మొదలుపెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
  •     పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వర్క్ చేస్తామంటూ కంపెనీ మొండి వాదన

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు ఎస్ఎల్​బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. బ్యారేజీల పునరుద్ధరణ పనులతో పాటు ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో మిగిలిపోయిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే బ్యారేజీలకు పునరుద్ధరణ డిజైన్ల (రీ హాబిలిటేషన్ డిజైన్స్) కోసం కన్సల్టెన్సీ ఎంపిక ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతలను ‘ఆఫ్రీ’కే అప్పగించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు ఆ సంస్థ సాంకేతిక అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్​కు సంబంధించిన అంశాలను వివరించారు. ఇప్పటికే ఆ ఫైలును ప్రభుత్వానికి పంపారు. 

ఈ క్రమంలోనే ఆదివారం సెక్రటేరియెట్​లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్​ రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం బ్యారేజీలతో పాటు ఎస్ఎల్​బీసీ టన్నెల్ పనులపైనా రివ్యూలో చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం నిరుడు అక్టోబర్ 2న ప్రభుత్వం ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ని ఆహ్వానించగా.. ఆఫ్రీ, ఆర్వీ అసోసియేట్స్​, డీఎంఆర్ సహా 5 కంపెనీలు ఈవోఐలను దాఖలు చేశాయి. అందులో 3 సంస్థలకు ప్రైస్​బిడ్ల కోసం రిక్వెస్ట్​ పంపగా.. 3 సంస్థలూ ప్రైస్​బిడ్లను దాఖలు చేశాయి. వాటిని స్టడీ చేసిన ఇరిగేషన్​ శాఖ అధికారులు.. ప్రభుత్వానికి పంపారు. 

అన్ని దరఖాస్తులను పరిశీలించాక ఆఫ్రీకే అన్ని అర్హతలున్నాయని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్​ డయాఫ్రమ్​వాల్​ నిర్మాణం కోసం ఆఫ్రీ సంస్థ పనిచేసింది. అండర్​వాటర్ సర్వేల్లో కూడా ఆ సంస్థకు అనుభవం ఉండటంతో ఆఫ్రీనే ఖరారు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఏదైనా ఐఐటీతో భాగస్వామిగా ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో.. ఆఫ్రీ సంస్థ ఐఐటీ బాంబేతో కలిసి దరఖాస్తు సమర్పించిందని చెప్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తారని అంటున్నారు. 

ఎస్ఎల్​బీసీది మళ్లీ అదే కథ..

ఎస్ఎల్​బీసీ టన్నెల్ పనుల విషయం మళ్లీ పాత కథే రిపీట్ అవుతున్నది. ఈ నెలాఖరునాటికి అత్యాధునిక పద్ధతుల్లో టన్నెల్ తవ్వకాన్ని డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా చేపట్టేందుకు సర్కారు నిర్ణయించింది. అయితే, మీటింగ్​కు వచ్చిన ఏజెన్సీ జేపీ అసోసియేట్స్ మాత్రం మళ్లీ పాత రాగమే అందుకున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరునాటికి డీబీఎంతో పనులు స్టార్ట్​ చేయాలని మంత్రి ఉత్తమ్​.. సంస్థకు ఆదేశాలివ్వగా మళ్లీ పైసల పాటే పాడిందని సమాచారం. డబ్బులు చెల్లిస్తేగానీ పనులు చేయబోమంటూ మొండివాదనలకు దిగినట్టు తెలిసింది. 

దీనిపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయినట్టు సమాచారం. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నా.. పనిని కొంచెం కూడా ముందుకు తీసుకెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా, కంపెనీకి ఇప్పటిదాకా వివిధ దఫాల్లో రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం బిల్లులను చెల్లించింది. మరో రూ.100 కోట్లదాకా మాత్రమే బకాయి ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఎస్క్రో అకౌంట్​ను ఓపెన్​ చేసి పనులకు సంబంధించిన బిల్లులను దాంట్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించగా.. ఒకట్రెండు రోజుల్లో అకౌంట్ నంబర్ వచ్చే అవకాశాలున్నాయి.

ఆ పనులూ చేయలే..

టన్నెల్ కూలిపోయినప్పుడు.. అక్కడ పేరుకుపోయిన శిథిలాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన ప్రభుత్వమే తొలగించింది. ఆ పనులను కంపెనీయే చేయాల్సి ఉన్నా.. ఎప్పట్లాగానే ఆ సంస్థ మొండిగా బిల్లుల కోసమే పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వమే ముందుకొచ్చి నిపుణులను తీసుకొచ్చి ఆ పనులను చేయించింది. కొద్ది రోజుల కిందే టన్నెల్ బోరింగ్ మెషీన్ ముక్కలను లోపలి నుంచి తొలగించారు. టన్నెల్​ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకువెళ్తున్న నేపథ్యంలో.. దానిని ఆసరాగా తీసుకునే ఆ సంస్థ బ్లాక్​మెయిల్​ చేస్తూ గేమ్స్ ఆడుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.