యాసంగిలో భారీగా మక్కల సాగు..నెలన్నరలోనే 6.70 లక్షల ఎకరాల్లో పంట

యాసంగిలో భారీగా మక్కల సాగు..నెలన్నరలోనే 6.70 లక్షల ఎకరాల్లో పంట
  •      సీజన్ ​ముగిసే నాటికి 10 లక్షల ఎకరాలు దాటే చాన్స్
  •     యాసంగి పంటల్లో వరి తర్వాత మక్కలదే రెండో స్థానం
  •     సర్కార్ ఇచ్చిన మద్దతు ధర భరోసాతో రికార్డు స్థాయిలో సాగు

హైదరాబాద్, వెలుగు: ఈసారి యాసంగిలో మక్కల సాగు భారీగా పెరుగుతున్నది. ఏటా యాసంగి సీజన్ మొత్తం మక్కల సాగు సాధారణంగా  6.45 లక్షల ఎకరాలు కాగా..ఈసారి సీజన్ ప్రారంభమైన నెలన్నరలోనే  6.70 లక్షల ఎకరాల్లో సాగై రికార్డు సృష్టిస్తోంది. సీజన్​ముగిసే నాటికి 10 లక్షల ఎకరాలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయని అగ్రికల్చర్ ఎక్స్​పర్ట్స్​అంటున్నరు. 

సర్కారు గత రెండేండ్లుగా మద్దతు ధరకు మక్కలను కొనుగోళ్లు చేస్తోంది. మార్కెట్​లో మద్దతు ధరకు తక్కువగా విక్రయాలు జరుగుతుంటే వెంటనే మార్క్​ఫెడ్​ను నోడల్​ఏజెన్సీగా  రంగంలోకి దించి మక్కలు సేకరిస్తున్నది. దాంతో ఈ యాసంగిలో కూడా మార్కెట్​లో మద్దతు ధర దక్కుతుందనే భరోసాతో రైతులు భారీగా మక్కలను సాగు చేస్తున్నారు. 

సాధారణం కంటే ఎక్కువ..

ఏటా యాసంగి సీజన్​లో ఈ సమయానికి మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా..ఈసారి మాత్రం గతంతో సంబంధం లేకుండా ఏకంగా 6.70లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ప్రధానంగా  ఖమ్మం జిల్లాలో 1.34 లక్షల ఎకరాల్లో, నాగర్​ కర్నూల్​ జిల్లాలో 68 వేల ఎకరాల్లో,  వరంగల్​జిల్లాలో 61వేల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 50 వేల ఎకరాల్లో, మహబూబాబాద్​ జిల్లాలో 49వేల ఎకరాల్లో సాగైంది. 

ఆ తరువాత నిర్మల్​లో 43 వేల ఎకరాల్లో, నిజామాబాద్​ జిల్లాలో 32 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 30 వేల ఎకరాల్లో, గద్వాల జిల్లాలో 29 వేల ఎకరాల్లో, కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో మక్కల సాగు నమోదైంది. యాసంగి సీజన్​ ప్రారంభంలోనే ఇంత పెద్ద ఎత్తున మక్కల సాగు షురూ కావడంతో సీజన్​ ముగిసే నాటికి ఈయేడు మక్కల సాగు రికార్డులు సృష్టించనుందని ప్రభుత్వ గణాంకాలతో స్పష్టమవుతోంది.

25 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు

రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్, నవంబరు నెలల్లో భారీగా కురిసిన వానలతో రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. వాగులు, వంకలు, చెరువులు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వీటికి తోడుగా భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు ఫుల్​గా రీచార్జ్​ అయ్యాయి. దాంతో  యాసంగి సాగు గణనీయంగా పెరుగుతోంది.

ఇప్పటికే 25 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగైయ్యాయి. ఈ సీజన్లో అత్యధికంగా వరి 11.59లక్షల ఎకరాల్లో సాగైంది.  ఆ తరువాత స్థానంలో మక్కలు ఉండగా.. వేరుశనగ 1.60లక్షల ఎకరాలు, పప్పుశనగ (బెంగాల్​గ్రామ్​) 1.56లక్షల ఎకరాల్లో సాగైంది. అదే విధంగా జొన్నలు 1.40 లక్షల ఎకరాలు, మినుములు 25 వేల ఎకరాల్లో సాగైంది.