వరంగల్‍, హనుమకొండను ఒకే జిల్లా చేయిస్తా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, హనుమకొండను ఒకే జిల్లా చేయిస్తా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి
  • కేసీఆర్‍ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలుగా నాశనం చేసిండు
  • పౌర సంఘాలు, మేధావుల దీక్షలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు :  హనుమకొండ, వరంగల్‍ జిల్లాలను ఒక్కటిగా చేయిస్తానని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి హామీ ఇచ్చారు. ఒకే జిల్లాగా చేయాలనే డిమాండ్‍తో పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే పాల్గొని దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాను ఆరు ముక్కలుగా చేసిండని మండిపడ్డారు.

వరంగల్‍కు చరిత్ర లేకుండా కుట్ర చేసి సెంట్రల్ జైల్‍ తరలించాడని ఆరోపించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి వరంగల్‍ జిల్లాలో ఉంటే, దాని పార్కింగ్‍ జాగా హనుమకొండ జిల్లాలో ఉందని తెలిపారు. హనుమకొండ జిల్లా వరంగల్‍ పశ్చిమ సెగ్మెంట్ పరిధిలోని 29,11 డివిజన్లు వరంగల్‍ జిల్లా తహసీల్దార్ పరిధిలో ఉన్నాయని చెప్పారు. శాయంపేట జడ్పీటీసీ హనుమకొండ జిల్లాలో ఉంటే.. వారు వరంగల్‍ సభలో పాల్గొనాల్సి వస్తుందని పేర్కొన్నారు.

జిల్లాలను విడగొట్టడంతో ప్రణాళికలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తద్వారా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా రెండు జిల్లాలను కలిపేందుకు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‍రెడ్డి కూడా రెండు జిల్లాలను కలిపేందుకు సుముఖంగా ఉన్నారన్నారు.

హైదరాబాద్‍ తర్వాత రెండో అతిపెద్ద సిటీ వరంగల్ ను  ఒకే జిల్లాగా చేయాలని రిటైర్డ్ ప్రొఫెసర్‍కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. కుడా చైర్మన్‍, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి దీక్ష వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఈ దీక్షలో పౌర సంఘాల నేతలు మాజీ మేయర్ తక్కళ్లపల్లి రాజేశ్వరావు, పుల్లూరు సుధాకర్‍, వివిధ పార్టీలు, ఉద్యమ, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.