విలేజ్లను విడగొట్టారు.! ఎన్ హెచ్-163పై యాదగిరిగుట్ట నుంచి ఆరెపల్లి ఫోర్ లైన్ విస్తరణ

 విలేజ్లను   విడగొట్టారు.! ఎన్ హెచ్-163పై యాదగిరిగుట్ట నుంచి ఆరెపల్లి ఫోర్ లైన్ విస్తరణ
  • ప్లానింగ్ లోపాలతో రోడ్డుపై రెండుగా విడిపోయిన ఆరు ఊర్లు
  • ఇరువైపులా కనెక్టివిటీ కట్ అవడంతో ప్రజల ఇబ్బందులు
  • డేంజర్​గా రోడ్డు క్రాస్​ చేస్తున్న జనాలు.. తరచూ ప్రమాదాలు 

హనుమకొండ, వెలుగు: హైదరాబాద్- భూపాలపట్నం హైవే (ఎన్ హెచ్-163)లో భాగంగా యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వరకు నిర్మించిన ఫోర్ లైన్ రోడ్డు పలుచోట్ల గ్రామాలను విడదీసింది. జనగామ నుంచి కరుణాపురం వరకు దాదాపు ఆరు ఊర్ల మధ్య నుంచి రోడ్డు వెళ్లగా, ఆయాచోట్ల రోడ్డు దాటేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఫలితంగా ఉండేది ఒకే గ్రామమైనా రోడ్డు విడగొట్టడంతో అక్కడి జనాలు కూడా రెండూ వేర్వేరు ఊర్లనే భావనలో పడ్డారు.

అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం లేక జనాలు డేంజర్ అని తెలిసినా రోడ్డు క్రాస్ చేయక తప్పడం లేదు. హైవేపై  స్పీడ్ గా వచ్చే వెహికల్స్ తో ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి జనాల ప్రాణాలు కాపాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

యాదగిరిగుట్ట టూ ఆరెపల్లి..

నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్​హెచ్​పీ) ఫోర్త్ ఫేజ్ కింద కేంద్రం ఎన్ హెచ్-163ని విస్తరించింది. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ నగర శివారులోని ఆరెపల్లి (దామెర క్రాస్) వరకు 99 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ.1905.23 కోట్లతో అభివృద్ధి చేసే పనులు చేపట్టింది. ముఖ్యంగా ఎన్​హెచ్-163 వరంగల్ ట్రై సిటీలోకి ఎంటరవకుండా సాఫీగా ప్రయాణం సాగించేందుకు హనుమకొండ జిల్లా పరిధిలోని కరుణాపురం నుంచి ఆరెపల్లి వరకు దాదాపు 29 కిలోమీటర్ల మేర కొత్తగా బైపాస్ నిర్మించారు. 2015లోనే ఈ పనులకు ఆమోదం రాగా, 2016లో స్టార్ట్ అయ్యాయి. 2020 డిసెంబర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోడ్డును అధికారికంగా ప్రారంభించారు.

ఇదిలాఉంటే ఎన్​హెచ్-163 విస్తరణలో చాలాచోట్లా ఆఫీసర్ల ప్లానింగ్ లోపాలు బయటపడ్డాయి. ప్రధానంగా కరుణాపురం సమీపంలోని డీపీఎస్ వద్ద బ్రిడ్జి నిర్మించినా, ప్లానింగ్ లోపాల కారణంగా వరంగల్ నగరంలోకి ఎంటర్ కావాల్సిన వాహనాలు గజిబిజిగా వెళ్లాల్సి వస్తోంది. 

రెండు భాగాలైన ఆరు ఊర్లు..

ఎన్​హెచ్-163లో యాదగిరిగుట్ట నుంచి ఆరెపల్లి వరకు రోడ్డు నిర్మించే క్రమంలో ఆఫీసర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో గతంలో ఉన్న రోడ్డును డెవలప్ చేసే క్రమంలో జనగామ నుంచి కరుణాపుం వరకు దాదాపు ఆరు గ్రామాలు రెండుగా విడిపోయాయి. ఇదివరకు ఈ మార్గంలో రోడ్డు ఉన్నా రోడ్డు దాటేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు ప్రమాదాల నివారణకు క్రాష్ బారియర్స్ ఏర్పాటు చేయడం, ఇరువైపులా రాకపోకలు సాగేందుకు ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఎన్​హెచ్-163 గ్రామాలను రెండుగా విడగొట్టినట్లయ్యింది.

జనగామ జిల్లా పరిధిలోని నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్లు, స్టేషన్ ఘన్ పూర్, చిన్నపెండ్యాల, హనుమకొండ జిల్లా పరిధిలోని కరుణాపురం గ్రామాలు రెండు ముక్కలుగా విడిపోయాయి. కాగా, రోడ్డు నిర్మాణ క్రమంలో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ లను ప్రతిపాదించాల్సిన ఎన్​హెచ్ఏఐ ఆఫీసర్లు స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా దాదాపు ఆరేండ్ల నుంచి తమకు ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.

డేంజర్ అయినా.. రోడ్డు దాటక తప్పదు..

జనగామ నుంచి కరుణాపురం వరకు ఆరుచోట్ల గ్రామాలు రెండు ముక్కలవగా ఆయా ఊర్ల వద్ద రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరువైపులకు రాకపోకలు సాగించే బైకులు, ఇతర వాహనాలు ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైపాస్ లు, అండర్ పాస్ వద్ద యూటర్న్ తీసుకుని వస్తుండగా, పాదాచారులు మాత్రం అంతదూరం నడిచి అవతలి వైపు వెళ్లాలంటే ప్రయాస పడక తప్పడం లేదు. స్టేషన్ ఘన్ పూర్ లో రోడ్డు అవతలి వ్యక్తులు బస్టాండ్ వైపు రావాలంటే అండర్ పాస్ కోసం దాదాపు అర కిలోమీటర్ వెళ్లాల్సిన పరిస్థితి. అంతదూరం వెళ్లలేక చాలామంది రోడ్డు క్రాస్ చేసి బస్టాండ్ కు చేరుకుంటున్నారు.

కరుణాపురం వద్ద స్థానికులతో పాటు చర్చికి వచ్చే జనాలు ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్లాలంటే రోడ్డు దాటక తప్పడం లేదు. ఈ క్రమంలోనే హైవేపై స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కింద పెద్దపెండ్యాలకు చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి కరుణాపురం వద్ద రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొట్టగా, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి చోట్ల కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినా సమస్య తీరుతుంది.

రోడ్డు నిర్మాణ సమయంలోనే స్థానికులు అప్పటి లీడర్లకు విన్నవించినా వారు కూడా చెవినపెట్టలేదు. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో జనాలు రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా బాధిత గ్రామాల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందంటున్నారు. ఆ దిశగా లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి..

నేషనల్ హైవే వల్ల ముక్కలైన గ్రామాల వద్ద ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్లడానికి సౌకర్యం లేదు. అవతలి వైపు వెళ్లాలంటే దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు క్రాస్ చేస్తుంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి.- మామిడాల దేవేందర్ రెడ్డి, గుర్రాలకుంట్ల

తరచూ ప్రమాదాలు జరుగుతున్నయ్..

కరుణాపురం వద్ద ప్రతి శనివారం చర్చికి వచ్చే జనాలతో రష్ ఎక్కువగా ఉంటుంది. సరైన ఏర్పాట్లు లేక జనాలు హైవే దాటక తప్పని పరిస్థితి. రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయారు. ఇకనైనా ఇక్కడ ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేలా బ్రిడ్జి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.- ఎడ్విన్ బాలస్వామి, కరుణాపురం