వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     మేడారం జాతర.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: భట్టి

ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జాతరను నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం మేడారంలో భట్టి పర్యటించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, నిర్మాణంలో ఉన్న రహదారులను పరిశీలించారు. 

తర్వాత హరిత హోటల్‌‌‌‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. ‘‘మేడారం జాతర కోసం రూ.251 కోట్లు ఖర్చు చేస్తున్నం. ఇందులో జాతర నిర్వహణకు రూ.150 కోట్లు.. ఆలయ విస్తరణ, పునరుద్ధరణ పనులకు రూ.101 కోట్లు వెచ్చిస్తున్నం. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి” అని వెల్లడించారు. మిగిలిన పనులను ఈ నెల 15కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గంటకు వెయ్యి వాహనాలు: సీతక్క 

మేడారానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారని, గంటకు వెయ్యి వాహనాలు మేడారం చేరుకున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. 5 లక్షల మంది భక్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. క్రౌడ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌కు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తామని చెప్పారు. రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు.