జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న లోడ్ లారీ మాయం

జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న  లోడ్ లారీ మాయం
  • గోదాముకు చేరని 325 క్వింటాళ్లు 
  • ఆలంపూర్ పీఏసీఎస్​సిబ్బంది నిర్లక్ష్యం
  • రైతులకు అందని పంట డబ్బులు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన లారీ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలంపూర్ పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంతో 325 క్వింటాళ్ల లోడుతో వెళ్లిన లారీ ఆచూకీ లేకుండాపోయింది. బాధిత రైతులు తెలిపిన మేరకు.. ఆలంపూర్ పీఏసీఎస్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత డిసెంబర్ 21న సెంటర్ లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను మూడు లారీల్లో వికేర్ గోదాముకు తరలించారు. ఒక్కొక్క లారీకి 325 క్వింటాల చొప్పున లోడ్ చేసి పంపించారు. కానీ, పీఏసీఎస్ గోదాముకు రెండు లారీలు మాత్రమే వెళ్లగా.. మరో లారీ మాయమైంది.

 మొక్కజొన్న అమ్మిన రైతులకు డబ్బులు పడకపోవడంతో పీఏసీఎస్ సిబ్బందిని అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. రెండు లారీలే గోదాముకు  వచ్చాయని, మరో లారీ రాకపోవడంతోనే రైతులకు డబ్బులు పడలేదని తేలింది. మూడో లారీ ఎవరిదో తెలియదని ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు తప్పించుకున్నారు.  దీంతో బాధిత రైతులు ఆలంపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  రైతులకు 7.80 లక్షలు చెల్లించాలి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంకా కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 325 క్వింటాలకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.