వడ్లు కొనడంలో వెనకబడిన్రు.. టార్గెట్ 2.20 లక్షల టన్నులు.. కొన్నది 65 వేల టన్నులే..

వడ్లు కొనడంలో వెనకబడిన్రు..  టార్గెట్ 2.20 లక్షల టన్నులు.. కొన్నది 65 వేల టన్నులే..
  • బయటి మార్కెట్​ను నమ్ముకున్న రైతులు
  • వడ్ల కేటాయింపులో ఆఫీసర్ల కొర్రీలు

నాగర్​కర్నూల్,​ వెలుగు: వానాకాలం నాగర్​కర్నూల్​ జిల్లాలో రైతులు పండించిన వడ్ల కొనుగోలులో జిల్లా అధికారులు వెనకబడ్డారు. జిల్లాలో 2.20 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు 220 సెంటర్లు ఏర్పాటు చేసిన ఆఫీసర్లు మూడు నెలల్లో 65 వేల టన్నులతో సరిపెట్టారు. చివరి వరకు మరో 50 వేల టన్నుల వరకు కొంటామని ప్రకటిస్తున్నా బయటి మార్కెట్​లోనే ధర ఎక్కువగా వస్తుందని రైతులు అక్కడే అమ్ముకుంటున్నారు. సివిల్​సప్లై, మార్కెటింగ్, కో ఆపరేటివ్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్ల మధ్య సమన్వయలోపం, వడ్ల కేటాయింపులో సివిల్​సప్లై అధికారుల కొర్రీలు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి.

జిల్లాలో డీఫాల్ట్​ రైస్ ​మిల్లర్లు ఎక్కువగా ఉండగా, మిగిలిన మిల్లర్లను పక్కకు పెట్టడం, సీఎంఆర్  బకాయి పడిన​మిల్లులు లీజుకు తీసుకున్న​వారికి సివిల్​ సప్లై​ఆఫీసర్లు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా కొర్రీలు పెడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో సివిల్​ సప్లై అధికారి ఏసీబీకి పట్టుబడగా, జిల్లాలోనూ ఇదే తరహా దందా కొనసాగుతోందని అంటున్నారు. ఈ వానాకాలం సీజన్​లో జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అధిక వర్షాలతో కొంత పంట నష్టం జరిగినా, 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో లక్ష టన్నుల వరకు రైతులు తమ సొంత అవసరాలకు ఉంచుకోగా, మిగిలిన 3.50 లక్షల టన్నుల వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉంది.

ఎంఎస్​పీ కంటే ఎక్కవ రేట్..

ప్రభుత్వం ఎ గ్రేడ్​ రకానికి రూ.2,389, కామన్​ రకానికి రూ.2,369 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తాలు పేరుతో వేధిస్తే, వడ్లు కాంటా వేసి మిల్లులకు ట్రక్​ షీట్లు పంపించిన తర్వాత అక్కడ కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 3 నుంచి 5 కిలోల వరకు తరుగు పేరిట కటింగ్​ పెడుతున్నా రెవెన్యూ, సివిల్​ సప్లై అధికారులు వారికే మద్దతిస్తున్నారని అంటున్నారు. వర్షాలతో నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు కష్టపడ్డామని, ఇప్పుడు తమ కష్టమంతా మధ్య దళారులు కాజేస్తున్నారని వాపోతున్నారు. వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు, కవర్లు లేకపోవడం, సకాలంలో కాంటా చేయకుండా ఇబ్బంది పెట్టారు.

ఈక్రమంలో బహిరంగా మార్కెట్​లో ఎంఎస్​పీ కంటే రూ.200 నుంచి రూ.400 వరకు ఎక్కువ ధర రావడంతో రైతులు వారికే అమ్ముకున్నారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వడ్లకు రూ.144 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.140 కోట్లు చెల్లించారు. మరో రూ.4 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంది. సన్నవడ్లకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ కింద జిల్లాలో రూ.5.50 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,200 మంది రైతులకు రూ.3.16 కోట్లు బోనస్​ చెల్లించారు. మిగిలిన 800 మంది రైతులకు బోనస్​ చెల్లించాల్సి ఉంది.

ధాన్యం కేటాయింపులో కొర్రీలు..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన వడ్ల కొనుగోళ్లకు సంబంధించి సీఎంఆర్​ పెట్టకుండా ఎగ్గొట్టిన రైస్  మిల్లర్లను బ్లాక్​ లిస్టులో పెట్టారు. మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నప్పటికీ పెనాల్టీ  కట్టించుకొని బ్యాంక్​ గ్యారెంటీ ఇచ్చిన వారికి ఈసీజన్​లో వడ్లు కేటాయించారు. బియ్యం రీ సైక్లింగ్​ కేసుల్లో ఇరుక్కున్న వారికి కూడా వడ్లు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలాఉంటే​బ్యాంక్  గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్లలో కొందరికి ఈ సీజన్​లో వడ్లు కేటాయించకుండా వేధించడంతో పాటు రెండు సీజన్లలో సీఎంఆర్​ పెట్టకుండా బకాయిపడిన వారికి, రైస్​ మిల్లులను లీజ్ కు​తీసుకున్న వారికి కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లు కేటాయించేలా చక్రం తిప్పుతున్నారు. సివిల్​ సప్లై ఆఫీసర్లు, సిబ్బంది మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి నిల్వల్లో తేడాల నమోదులో చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.