పాక్ లో పెండ్లింట్ల పేలిన సిలిండర్... వధూవరులు సహా 8 మంది మృతి

పాక్ లో పెండ్లింట్ల పేలిన సిలిండర్... వధూవరులు సహా 8 మంది మృతి

ఇస్లామాబాద్: వివాహం జరుగుతున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వధువు, వరుడు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు.  ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌‌లోని సెక్టార్ జీ-7/2లో ఘోరం చోటుచేసుకుంది. అలాగే ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారని, శిథిలాల నుంచి 19 మందిని బయటకు తీసి రక్షించామని రెస్క్యూ టీమ్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ అదనపు డిప్యూటీ కమిషనర్ (జనరల్) సాహిబ్‌‌జాదా యూసుఫ్ మీడియాతో మాట్లాడుతూ పేలుడు కారణంగా నాలుగు ఇండ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. 

మృతుల్లో వధువు మరియు వరుడు ఉన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తులో గ్యాస్ లీకేజీ కారణంగా సిలిండర్ పేలుడు సంభవించినట్టు తేలిందని ఆయన అన్నారు. వేడుక జరుగుతున్న సమయంలో పేలుడు జరిగింది. ఆ సమయంలో ఇంట్లో పెద్ద సంఖ్యలో బంధువులు, పెండ్లివి వచ్చిన వారు ఉన్నారు. పేలుడు ధాటికి ఇల్లు మొత్తం కూలిపోయింది. దీంతో అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు వారిలో చాలా మందిని వెలికి తీసి కాపాడాయని అధికారులు చెప్పారు.